వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో వీళ్లను నీటి కష్టాలు వెంటాడుతాయి. మురికి నీళ్లే తాగి రోగాలను తెచ్చు కుంటున్నారు. తాగు నీరు అందక గిరిజనులు, బిందె నీళ్ల కోసం కొండల్లో కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు.

బోర్లు చెడిపోయి, బావుల్లో పూడిక తీయక, జనం ఊట చెలమల్లో నీటిని, చివరకు పంటలకు పెట్టే నీటినే తాగే పరిస్ధితి ఏర్పడింది. విశాఖ జిల్లా పాడేరు మండలం, అరకు సమీపంలో డుంబ్రిగుడ మండలం, సొవ్వ, పెదలబుడు,కొర్రాయి, అనంతగిరి మండలం,బొంగిజా, పార్వతీ పురం సమీపంలో కొండబారిడి గ్రామాలలో మేం పర్యటించాం. అక్కడ నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే గిరిజన మహిళలను పలకరించాం...


'' ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో , ఇంటింటికి 20 లీటర్ల మంచినీళ్లు ఇస్తామని తెలుగుదేశం వాళ్లు హామీ ఇచ్చారు. ఇంటింటికి కుళాయిలు వేస్తామన్నారు. కానీ అది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు,. కనీసం ఊటకుంట నీళ్లను పైపుల ద్వారా గ్రామాలకు తెచ్చినా కొంత దప్పిక తీరేది. ఈ సారి జగన్‌ ప్రభుత్వమైనా మా సమస్య తీరుస్తుందని కొండంత ఆశతో ఉన్నాం.'' అంటున్నారు కొండ ప్రజలు

అసలు సమస్య ఇదీ...

తూరుపు కోస్తా తీరంలో పాడేరు, సీతంపేట, పార్వతీ పురం ఐటిడిఎల పరిధిలో మొత్తం 39 మండలాలు 7 వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో 70 శాతం గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ మూడు ఐటీడీఏల పరిదిలో భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని భూగర్భజల శాఖ వారు చెబుతున్నారు. 2018 మేలో 5.5 మీటర్లున్న నీటిమట్టం ఈసారి 6.2 మీటర్లకు పడిపోయింది. అరకులో ఒక మీటరు వరకూ పడిపోయాయి. కానీ ఇక్కడ తాగునీటి సౌకర్యం కల్పించడం అంత కష్టం కూడా కాదని స్థానికులు చెబుతున్నారు.

పరిష్కారం ఇలా ....

మన్యం ప్రాంతంలో సాగునీరు,తాగునీరు కోసం కొండల మీది ఊటకుంటల మీద ఆధారపడుతుంటారు. పాడేరు లో ఈ నీటినే పిల్టర్‌ చేసి రామక్రిష్ణ మిషన్‌ వారు పైపుల ద్వారా కొన్ని గ్రామాలకు అందిస్తున్నారు. అదే పద్దతిని ప్రభుత్వం కూడా అమలు చేస్తే నీటి సమస్యను కొంత వరకు తీర్చవచ్చు. ఏడాదంతా ప్రవహించే ఊట నీరు దిగువకు జారిపోకుండా , చెక్‌ డ్యాంలు,రాతి కట్టలు నిర్మించి, బోర్లు, కుళాయిలు బాగు చేయిస్తే తక్కువ నిధులతోనే ఈ సమస్య తీర్చవచ్చు. '' ముఖ్యమంత్రి స్పందించి మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీర్చి, రోగాలు బారిన పడకుండా, మెరుగైన జీవితాన్ని కల్పించాలని..'' ఈ ప్రాంతపు వాసులు కోరుతున్నారు.


ఫోటోలు వివరాలు

1, విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలంలోని ఓ గ్రామంలో ప్రస్తుతం ప్రజలు ఎదొర్కొంటున్న తాగునీటి సమస్య.

2, అరకు నియోజకవర్గ పరిధిలోని డుంబ్రిగుడ మండలం, సొవ్వ పంచాయతీలో తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు.

3 అనంతగిరి మండలం ఎన్‌ ఆర్‌ పురం నాన్‌ షెడ్యూల్‌ పంచాయిట్‌ బొంగిజా గ్రామ ప్రజలు తాగునీటికి ఈ ఊట కుంటే ఆధారం.

మరింత సమాచారం తెలుసుకోండి: