‘బలమైన శాసనసభ కమిటీలను నియమించాలి. వాటికి విస్తృతాధికారాలను ఇవ్వాలి. ప్రస్తుతం శాసనసభ్యులకు సభలో తమ గొంతు వినిపించే అవకాశం లేక, బయటా తగినంత గౌరవం లేక... ఈతరాని వాళ్లను నీళ్లలో పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉక్కిరిబిక్కిరవుతున్నారు’ అని లోక్‌సత్తా, ఫౌండేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థల వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి సభ్యులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం రాజకీయ నైతికత, ప్రజల్లో ప్రతిష్ఠ పెంచుకోవడం అన్న అంశంపై మాట్లాడారు. ‘శాసనసభ్యులు నిరంతరం ఒత్తిడిలో ఉంటున్నారు. అధికారాలు లేకుండా వారిపై బాధ్యత పెట్టడమే దానికి కారణం. ఎన్నికలు, పుష్కరాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో, తుపానులు వంటి విపత్తులు వచ్చినప్పుడు మన అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోంది. అప్పుడు నిధులకు కొరత ఉండదు. జవాబుదారీతనం ఉంటుంది.

 

శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అసెంబ్లీ వ్యవహారాలు.. బడ్జెట్‌ను అవగాహన చేసుకోవడం, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల్లో లెజిస్లేటర్ల పాత్ర వంటి వివిధ అంశాలపై నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. రెండోరోజు శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి ఆధ్వర్యంలో శిక్షణ సాగింది. అజేయ కల్లం మాట్లాడారు. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు వక్తలు సమాధానమిచ్చారు.

 

అన్ని వ్యవస్థలు చేయాల్సిన పనిని చేయగలిగేలా సుపరిపాలన అందించాలని ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవస్థలో నిజాయతీపరులైన సమర్థులే ఇబ్బందుల్లో పడుతున్నారని చెప్పారు. పార్టీలకు సైద్ధాంతిక విలువల్లేనప్పుడే ఫిరాయింపులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. గతంలో ఐఏఎస్‌లంటే నిజాయతీపరులని అనేవారని, ఇప్పుడు వారిలో నిజాయతీ లేదనే విమర్శలొస్తున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: