కేంద్ర ఆర్థికశాఖ‌మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో తన తొలి బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతావనిలో కేంద్ర బడ్జెట్‌ను ప్రకటిస్తున్న తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రి సీతారామనే కావడం విశేషం. ఇంతకుముందు 1970-71లో ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్‌ను ఓసారి ప్రకటించారు. అయితే మొరార్జీ దేశాయ్ రాజీనామాతోనే తాత్కాలిక ఆర్థిక మంత్రి హోదాలో ఇందిరా బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇక పూర్తి, మధ్యంతర బడ్జెట్లను కలుపుకుని ఈసారిది 89వ బడ్జెట్.


స్వతంత్ర భారతంలో వచ్చిన తొలి బడ్జెటే.. మధ్యంతర బడ్జెట్ కావడం గమనార్హం. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31దాకా ఏడున్నర నెలలపాటు ఈ బడ్జెట్ అమల్లో ఉన్నది. మార్చిలో ఏడాది కాలం కోసం బడ్జెట్‌ను ఆమోదించినా.. భారత్, పాకిస్తాన్ విభజన కారణంగా అదికాస్తా రద్దయ్యింది. స్వేచ్ఛా భారతం కోసం తొలి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లను ప్రకటించారు. దేశ ఆర్థిక శాఖ మంత్రుల చరిత్రలో ఇన్నిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారెవరూ లేరు. తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రకటించి కాంగ్రెస్ నేత పీ చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధాన మంత్రి హోదాల్లోనే కేంద్ర బడ్జెట్లను ప్రకటించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఆర్ వెంకటరామన్, ప్రణబ్ ముఖర్జీలు రాష్ట్రపతులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసిన సీడీ దేశ్‌ముఖ్.. ఆ తర్వాత ఆర్థిక మంత్రి అయ్యారు. 1951లో ఈయన తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


బ‌డ్జెట్‌లోని పదాల పరంగా 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇందులో 18,177 పదాలున్నాయి. ఆ తర్వాతి మూడు స్థానాల్లో అరుణ్ జైట్లీ ప్రసంగాలే ఉన్నాయి. 2014, 2017, 2016ల్లో బడ్జెట్ ప్రకటన సందర్భంగా ఈ సుదీర్ఘ ప్రసంగాలిచ్చారు. ఇవి వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. అయితే సమయం ప్రకారం 2003లో జస్వంత్ సింగ్ ఏకంగా రెండు గంటల 13 నిమిషాలు ప్రసంగించారు. అయితే 1977లో హెచ్‌ఎం పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం అతి చిన్నదిగా రికార్డు అయింది. ఇందులో కేవలం 800 పదాలున్నాయి.


1999కి ముందు ఏటా ఫిబ్రవరి నెల చివరి పని దినాన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. దీనికి ముగింపు పలుకుతూ యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు ప్రకటించారు. ఇక అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరం కోసం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను తెచ్చారు. అప్పట్నుంచి ఇదే రోజున బడ్జెట్ వస్తుండగా, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆ రోజున మధ్యంతర బడ్జెట్‌ను తేవాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రకటిస్తున్నారు. టీటీ కృష్ణమాచారి 1964-65 బడ్జెట్.. తొలిసారి అప్రకటిత ఆదాయం లేదా బ్లాక్‌మనీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సొమ్మును స్వచ్చంధంగా వెల్లడించే అవకాశాన్ని (వీడీఐఎస్) ఆయన తన 1965-66 మధ్యంతర, కేంద్ర బడ్జెట్లలో పరిచయం చేశారు. ఇక 1997-98 బడ్జెట్‌లో చిదంబరం వీడీఐఎస్ కిందే జరిమానాలు, వడ్డీలను రద్దు చేశారు. చర్యల నుంచి కూడా నల్లధన సంపన్నులకు విముక్తి కలిగించారు. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను అంతర్జాతీయ విపణిలోకి పంపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: