తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి ప్రపంచ కప్ లో స్థానం దక్కలేదు. ఈ అసంతృప్తితో ఆయన రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కులం కారణంగానే అంబటి రాయుడికి అవకాశాలు రాలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ఫేస్ బుక్ లో రాసిన వ్యాసం ఆలోచింపజేస్తోంది. ఆ వ్యాసం యథాతథంగా మీ కోసం..

రాయుడా!

ఈ దేశంలో రాయని రాజ్యాంగం నడుస్తోందిరా అమాయకుడా! బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రొల్ ఇన్ ఇండియా అనే సంఘంలో బోర్డ్ అనే పదస్థానంలో బ్రాహ్మిన్ అనే పదం మార్చి చదువుకో అంతా అర్థమైపోతుంది. ఈదేశం తరపున ఇప్పటిదాకా క్రికెట్ ఆడిన 190 పైచిలుకు ఆటగాళ్లలో పదీ, పదేనుకన్నా ఎక్కువ ఆటగాళ్లు మాత్రమే ఇతరకులస్తులని తెలుసుకో. అలాగని, ఇదేమైనా కులవిద్య అనుకునేవు? ఈ దేశానికి వచ్చిన రెండు ప్రపంచ కప్పులనీ కపిల్ దేవ్, ధోనీ అనే బ్రాహ్మనేతరులే ఈ జాతికి సాధించిపెట్టారనీ గుర్తించు.


ఇక్కడంతా ఇంతేనయా! ఆటలు కాదు మాటలు ముఖ్యమైన ఈ వింతక్రీడలో ప్రపంచకప్పులో 60ఓవర్ల ఆట ఆడి 36 పరుగులు చేసిన గవాస్కర్ లెజెండరీ. ఒక్కమ్యాచ్ చక్కగా ఆడని రవిశాస్త్రి ఏడాదికి ఎనిమిది కోట్లు తీసుకుని ఇదే జట్టుకిప్పుడు కోచింగ్ ఇస్తున్నాడు. వీళ్లని వెంటేసుకుని ప్రపంచకప్పు గెలిపిపంచిన కపిల్ దేవ్ అంటే ఇప్పుడెవరికీ తెలియని పేరు. మైదానంలో అరివీర భయంకర వెస్టీండిస్ ఆటగాళ్లకు ధీటుగా బంతులు విసిరిన ఆసియాగడ్డమీది తొలి ఫాస్ట్ బౌలర్ అయిన అతడు నాడు రెండు అదనపు చపాతీలకోసం కూడా డైనింగ్ హాల్లో పోరాడాడు. నిన్నమొన్న రిటైరైన ఈ దేశపు క్రికెట్ దేవుడు తొలి శతకం సాధించడానికి ఎన్ని మ్యాచులు ఆడాడో, ఎన్ని సంవత్సరాలు తినేశాడో తెలుసా? అతని కంటే ఘనుడైన అంటరానికులం వాడైనందున, వినోద్ కాంబ్లీని ఎలా పతనం చేశారో తెలుసా? ముసలోల్లు ముద్దులాడే ఈ రోహిత్ శర్మ హిట్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు పొందాడో తెలుసా?


ఇవన్నీ ఎందుకు? ఇదే వీవీయెస్ లక్ష్మణ్ అనే ఆటగాడు సెలెక్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రెస్ అంటే సహజంగానే అగ్రకుల రాతగాళ్లు మీటింగ్ పెట్టుకుని మరీ అతడికి అన్ని రకాలుగా రక్షణగా వుండాలని తీర్మాణం చేసుకున్న విషయం తెలుసా? "సెలెక్టర్లు జోకర్లు" అని మొహిందర్ అమర్నాథ అనే ఆటగాదు మేం చిన్నప్పుడే ప్రకటించేశాడు. నిన్ను సెలెక్ట్ చేసే కమిటీలోని ఐదుకుగు ఆటగాళ్ల మొత్తం కలిపిన స్కోరు నీ ఒక్కడి స్కోరుకున్నా తక్కువున్నప్పుడైనా అర్థం కావాలి. ఈ దేశంలో నైపుణయంగా ఆడడం కాదు తెలియాల్సిందని, కనీసం ఏ ఆట దాన్ని ప్రదర్శించాలోనని! వెళ్లు, పెళ్లి చేసుకుని చిన్న ఉద్యోగం చూసుకో. పిల్లల్ని కంటే ఇట్లాంటి గుంపు ఆటలు కాదు, వ్యక్తిగత ఆటలు ఆడించు, రేపు వాళ్ళు లియాండర్ పేస్ లాగా ఈ దేశం తరపున డెవిస్ కప్ లో ఆడనివ్వకపోయినా, మార్టినా నవ్రతిలోవా వంటి దిగ్గజం జతకలిసి అంతర్జాతీయ ఆటలు ఆడడానికి అవకాశముంటుంది.


రాయుడా! కిందికులాల్లో పుట్టినందుకు కవచకుండలాలు పెరికివేయబడిన గాధల్లో, బొటనవేలు తెగ్గోసిన కావ్యాల్లో నీ నైపుణ్యలకు విలువదక్కనందుకు ఆశ్చర్యం లేదుగానీ, ఇన్ని యుగాలు గడిచినా ఈ దేశంలో మార్పు రానందుకు దుఖ్ఖంగా వుందయ్యా. నీ నల్లని కళైన మొహం కన్నీళ్లూరే కనుపాపమీద అలుక్కుపోతుందయ్యా. ఈ జాతి మొహమ్మీద వుమ్మేసి వెళ్లిపోవయ్యా !


మరింత సమాచారం తెలుసుకోండి: