గత వారం రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలకు రాష్ట్రం పలు కష్టాలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల ధాటికి రాజధాని ముంబయిలో రహదారులపై భారీ ఎత్తున నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రత్నగిరి జిల్లాలో ఆనకట్ట తెగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఈ నేపథ్యంలో ముంబయి కష్టాల్లో ఉంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని, కూటములపై కాదని స్పష్టం చేశారు. పరువు నష్టం కేసులో నిన్న ఆయన ముంబయి కోర్టులో హాజరైన విషయం తెలిసిందే. రూ.15,000 పూచీకత్తుపై ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

 

అనంతరం ఆయన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబయిలో వర్షాల సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజలకు సాయం చేయకపోవడంపై మండిపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముంబయిలో ప్రజలు అవస్థలు పడుతుంటే మీరేం చేస్తున్నారు? నగరం సగం మునిగిపోతుంటే మీరెక్కడి కెళ్లారు? ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం ఇదే. వర్షాల కారణంగా రోడ్లమీదకొచ్చిన ప్రజలకు మనం కాపాడాలి.

 

ఇలాంటివి చేస్తేనే ప్రజల మద్దతు లభిస్తుంది. ప్రస్తుతం మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి. కూటమి సంగతి తర్వాత’ అని కాంగ్రెస్‌ నేతలను రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.   పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారిగా కార్యకర్తలతో మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: