బాలాకోట్‌ దాడుల తర్వాత ముష్కర మూకలు అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా శిక్షణ పొందుతున్నట్లు నిఘావర్గాలను సమాచారం అందింది. దీంతో ఆ దేశంలోని భారత దౌత్యకార్యాలయాలను అప్రమత్తం చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ చేసిన వైమానిక దాడితో కకావికలమైన జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థతో పాటు లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలు అఫ్గాన్‌ తరలినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

 

ఆ దేశంలోని కునార్‌, నంగర్హర్‌, నురిస్థాన్‌, కాందహార్‌ ప్రావిన్స్‌లో వీరు తిష్ఠ వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. పాక్‌లో నిషేధం ఎదుర్కొంటున్న ఈ ఉగ్రసంస్థలు అఫ్గానిస్థాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌లతో హస్తం కలిపినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల ఉగ్రవాద నేతలపై పాక్‌ తీసుకున్న చర్యలను భారత్‌ కంటితుడుపు చర్యగా అభివర్ణించినట్లు సమాచారం.

 

ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షలతో ఉగ్రసంస్థలపై పాక్‌ కఠిన చర్యలకు తీసుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నిధుల సేకరణకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందని గ్రహించి ఉగ్రసంస్థలు శిక్షణా శిబిరాలన్నింటినీ పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుకు తరలించినట్లు తెలుస్తోంది.

 

అఫ్గాన్‌లోని పలు భారత కార్యాలయాలపై ముష్కరులు దాడికి దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల పెంటగాన్‌ సైతం కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యలయానికి లష్కరే నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: