ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. టీడీపీ మాజీ కార్పొరేటర్లతో కేశినేని శనివారం తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వీఎంసీ తాజా మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణతో పాటు టీడీపీ తాజా మాజీ కార్పొరేటర్లందరూ హాజరయ్యారు.

 

‘వచ్చే ఎన్నికల్లో నాగుల్‌ మీరాను ఎమ్మెల్యేగా చూడాలి’ అని నాని వారితో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు పశ్చిమ నియోజకవర్గ నేతల్లో కలకలం రేపుతున్నాయి. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌, విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న అనుచరులు ఎంపీ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ నేతల్లో ఎందుకు అసహనం వ్యక్తమవుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నియోజకవర్గంతో నాగుల్‌ మీరాకు ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవాలి. జిల్లాలో మైనార్టీలకు అనుకూలమైన నియోజకవర్గం విజయవాడ పశ్చిమం. 1999లో నాగుల్‌ మీరా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలీల్‌ ఖాన్‌ చేతిలో సుమారు 3,100 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

 

నియోజకవర్గం ఆవిర్భవించాక ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు మైనార్టీలు గెలుపొందారు. దీంతో ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన నేరుగా.. పశ్చిమ నియోజకవర్గం నుంచే నాగుల్‌మీరా పోటీ చేస్తారని చెప్పకపోయినా ఆ వ్యాఖ్యల సారాంశం అదేనని పశ్చిమ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: