ఏపీలో విప‌క్ష టీడీపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే వ‌రుస‌పెట్టి వికెట్ల మీద వికెట్లు ప‌డుతూనే ఉన్నాయి. టీడీపీని వీడే వాళ్లు వైసీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ కొన్ని కండీష‌న్లు పెట్ట‌డంతో ఇప్పుడు వాళ్ల‌కు బీజేపీ బెస్ట్ ఆప్ష‌న్గా మారింది. బీజేపీలో ఎలాంటి నేతలను అయినా చేర్చేసుకుంటున్నారు. ప్రజా క్షేత్రంలో కనీసం వార్డు మెంబర్గా గెలిచే సత్తా లేని నేతలు కూడా... ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఆ పార్టీలో కీలక నేతలుగా మారిపోతున్నారు. ఎప్పుడో ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి తెలుగు రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు లాంటి వాళ్లకు కూడా రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలో చేర్చుకుంటోంది అంటే.... రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఏ స్థాయికి దిగజారిపోయింది అర్థం చేసుకోవచ్చు.


ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ కి చెందిన ఓ సీనియర్ నేతను సైతం ఇప్పుడు బిజెపి తమ పార్టీలో చేర్చుకుంది. మాజీ మంత్రి ఎస్‌.రామమునిరెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో శనివారం హైదరాబాదులో బీజేపీలో చేరారు. ఆయన 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ తొలి కేబినెట్లోనే ఆయ‌న‌కు త‌న మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 


అనంతరం 1984లో జరిగిన రాజకీయ సంక్షోభంలో రామ‌మునిరెడ్డి ఎన్టీఆర్‌ను గ‌ద్దె దింపిన నాదేండ్ల భాస్కర్‌రావు గ్రూపులో చేరి ఒక నెల పాటు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాజకీయ మార్పుల్లో ఆయ‌న్ను ప‌ట్టించుకునే వారు లేక‌పోవ‌డంతో స్త‌బ్దుగా ఉన్నారు. ఆ త‌ర్వాత తిరిగి టీడీపీలో చేరిన ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంచి ప్ర‌యార్టీ ఇచ్చారు.


చంద్ర‌బాబు ఆయ‌న్ను 1999లో రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా బీజేపీలో పలువురు చేరుతున్న సందర్భంలో ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావుతో కలిసి శనివారం కాషాయం కండువా కప్పుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: