ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడిలో ఆదివారం రాత్రి నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ జాతర సభలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  వర్గీకరణ ఉద్యమానికి దన్నుగా ఉన్నారని మంద కృష్ణ చెప్పారు. ఎస్సీ వర్గీకరణే తన జీవిత ధ్యేయమని, దానికోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

 

ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి కూడా వర్గీకరణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. భాజపా వర్గీకరణ చేసి తీరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈదుముడిలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావం, పాతికేళ్ల ప్రస్థానంలో ఒడిదొడుకులను ప్రస్తావిస్తూ మంద కృష్ణ ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వర్గీకరణ పోరుకు కట్టుబడి ముందుకు సాగుదామని శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీని ఒప్పించి, మెప్పించి ఎస్సీ వర్గీకరణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎమ్మార్పీఎస్‌ రజతోత్సవ సభ నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. పాతికేళ్ల  ఉద్యమ ప్రస్థానంలో ఎమ్మార్పీఎస్‌ ఎన్నో ఆటుపోట్లు, ఒడిదొడుకులను ఎదుర్కొని ముందుకు సాగిందన్నారు.

 

గుండె జబ్బుల పిల్లలు, వికలాంగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిందని కొనియాడారు. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మందకృష్ణ ఉద్యమించిన సమయంలో అప్పటి సీఎం ఆయన్ను బెదిరించే ప్రయత్నం చేసినా ఆందోళన నుంచి తప్పుకొనేందుకు మంద కృష్ణ ససేమిరా అన్నారని గుర్తు చేశారు. ఏదిఏమైనా వారి ఉద్యమం కడవరకు కొనసాగుతుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: