కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. గుంటూరు జిల్లాకు చెందిన కీల‌క టీడీపీ నాయ‌కుడు. దాదాపు 35 ఏళ్ల‌గా రాజ‌కీయాల్లో ఉన్న నేత‌. అనేక ప‌ద‌వులు కూడా చేప‌ట్టారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఆయ‌న‌కు సొంతం. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌విని ఆశించి భంగ ప‌డి.. అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఐదేళ్లుగా ఉండిపోయారు. ఆ స‌మ‌యంలో విప‌క్షంలో ఉన్న వైసీపీని అధికార టీడీపీ నాయ‌కులు, సాక్షాత్తు సీఎం చంద్ర‌బాబు ఏ విశంగా వేధించారో కోడెల మ‌రిచిపోయిన‌ట్టు ఉన్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. కాలం మారింది... గ‌తంలో అంటే కేవ‌లం పేప‌ర్లు(దిన‌ప‌త్రిక‌లు) మాత్ర‌మే ఉండేవి. కాబ‌ట్టి జ‌రిగిపోయిన విష‌యాల‌ను త‌వ్వి తీసేందుకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. కానీ, నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంల‌లో మాత్రం అంతా వేళ్ల‌మీదే.. అన్నీ క్ష‌ణాల్లోనే జ‌రిగిపోతున్నాయి.


గతం ఎంత లోతుల్లో ఉన్నా.. కూడా నిమిషాల వ్య‌వ‌ధిలోనే ప్ర‌జ‌ల క‌ళ్లముందు క‌ద‌లాడుతోంది. కాబ‌ట్టి నాయ‌కులు ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టే ప‌రిస్థ‌తి, మ‌సిపూసి మారేడు కాయ చేసే సాహ‌సం చేయడం నేటి రోజుల్లో సాధ్యం కాదు. స‌రే! ఇంత‌కీ ఇదంతా ఎందుకు చెప్ప‌ల్సి వ‌స్తోందంటే.. తాజాగా మాజీ అయిన గ‌త స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. మీడియా ముందుకు వచ్చారు. ఈయ‌న కుటుంబంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని వాపోయారు. త‌మ కుటుంబం నిప్పులాగా బ‌తికింద‌ని, త‌మ‌కు ఏ పాప‌మూ అంట‌లేద‌ని చెప్పుకొచ్చారు. స‌రే. ఇది ఆయ‌న సొంత వ్య‌వ‌హారం అనుకుందాం. అదే స‌మ‌యంలో కోడెల వారు.. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న అసెంబ్లీ స‌మావేశాల‌పైన తీవ్రమైన ఆవేద‌న వెలిబుచ్చారు. చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని స‌భ‌లో ఆయ‌న‌ను కించ‌ప‌రుస్తున్నార‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నంత ప‌ని చేశారు.


కేవ‌లం చంద్ర‌బాబును అవ‌మానించ‌డానికి స‌భ న‌డుస్తున్నట్టుగా ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇలాంటి జ‌గ‌న్‌కు మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. క‌ట్ చేస్తే.. కోడెల కామెంట్ల‌పై సోష‌ల్ మీడియా జ‌నాలు న‌వ్విపోతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఉండి.. చంద్ర‌బాబు చెప్పిన బాట‌లో న‌డిచిన మీరా.. ఇప్పుడు అసెంబ్లీ వ్య‌వ‌హారాల‌పై నీతులు వ‌ల్లిస్తున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు రువ్వుతున్నారు. స‌భ‌లో మీరు నిజాయితీగా వ్య‌వ‌హ‌రించారా.. కోడెల‌గారూ! అని నిల‌దీస్తున్నారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు త‌న పంచ‌న చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడు మీరేం చేశారు? త‌న పార్టీ గుర్తుపై గెలిచి, ఫిరాయించిన వారిపై వేటు వేయాల‌న్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ను బుట్ట‌దాఖ‌లు చేయ‌లేదా? ప‌్ర‌తిప‌క్ష నాయ‌కుడుగా ఉన్న జ‌గ‌న్‌కు మీరే మాత్రం మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. బుచ్చ‌య్య చౌద‌రి స‌హా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, బొండా ఉమా వంటి వారు జ‌గ‌న్‌ను ప‌దే ప‌దే `ల‌క్ష‌కోట్లు తిన్న రాబందు` అంటూ.. న‌భ‌లోనే నీచాతినీచంగా మాట్లాడిన‌ప్పుడు మీరు కంట్రోల్ చేయ‌లేక పోయారెందుకు! అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.


ప‌ట్టుమ‌ని రెండు నెల‌లు కూడా గ‌డ‌వ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు సంధిస్తున్న విధానం చాల‌ద‌న్నుట్టుగా.. ఏకంగా ఇప్పుడు స‌భ‌పైన మీరు విమ‌ర్శ‌లు చేయ‌డం మంచికాద‌ని నెటిజ‌న్లు సూచిస్తున్నారు. తొలి స‌భ‌లోనే స‌భా నాయ‌కుడిగా జ‌గ‌న్ కానీ, స‌భాప‌తిగా సీతారాం కానీ, తీసుకున్న నిర్ణ‌యాలు, చేసిన ప్ర‌క‌ట‌న‌లు స్పీక‌ర్‌గా ఉన్న స‌మయంలో మీ నాయ‌కుడు మ‌చ్చుకైనా ప్ర‌స్థావించే సాహ‌సం చేయ‌గ‌లిగారా ? పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని మ‌రింత క‌ఠినం చేయాల‌న్న జ‌గ‌న్ నిర్ణ‌యం.. స‌భ‌లో ప్ర‌తిప‌క్షానికి కూడా మాట్లాడే అవ‌కాశం ఇస్తామ‌ని గ‌ట్టి హామీ ఇచ్చిన ప్ర‌స్తుత స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని మీ హ‌యాంలో ఎందుకు తీసుకోలేక పోయారు? మీరు ఇప్పుడు ఒక వేలు చూపిస్తున్నారు. కానీ, మీవైపు నాలుగా వేళ్లు చూపిస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని నెటిజ‌న్లు ఫైరు అవుతున్నారు. మ‌రి ఈ స్పంద‌న త‌ర్వాతైనా కోడెల వారు త‌గ్గుతారో లేదో చూడాలి!!


మరింత సమాచారం తెలుసుకోండి: