టీవీ9 మాజీ సీఈవో ర‌వి ప్ర‌కాశ్ కేసుల్లో ఇరుక్కుని ల‌బోదిబో మంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న డియ‌రెస్ట్, ఇండిపెండెంట్ పెట్టుబ‌డి దారుడి సార‌ధ్యంలో న‌డుస్తున్న ఆన్‌లైన్ టీవీ మోజో కూడా ఇప్పుడు చిక్కుల్లో ప‌డింది. దీనిలో ప‌ని చేసిన సీఈవో(ఇప్పుడు మాజీ) రేవ‌తిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసును న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మోజో స్టూడియోలో తనను అవమానించారంటూ దళిత నాయకుడు హ‌మారా ప్రసాద్... రేవతి, యాంకర్ రఘుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


దీంతో వీరిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా రఘు ఉండగా, ఏ2గా రేవతి ఉన్నారు. దీనిలో భాగంగానే రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న మీడియా వ‌ర్గాల్లో సంచ‌ల‌న రేకెత్తించింది. వాస్త‌వానికి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తొలుత రేవ‌తికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆమె ఈ నోటీసుల‌కు స్పందించ లేదు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న మొత్తం శుక్ర‌వారం తెల్ల‌వారుజామునే గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం.  


అయితే, చాలా ఆల‌స్యంగానే మీడియాకు తెలిసిన ఈ ఘ‌ట‌న‌పై స్పందించేందుకు పోలీసులు నిరాక‌రించారు.  కాగా, గతంలో మోజో టీవీ స్టూడియోలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని రేవతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. షేర్లను బదలాయించాలంటూ తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ రేవతి పేర్కొన్నారు. న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని మోజో టీవీ ప్రధాన కార్యాలయంలో రేవతి ఆమరణ దీక్షకు దిగడం అప్పట్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక‌, ఇప్పుడు ఆమె అరెస్టుతో అస‌లు మోజో టీవీలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: