2019-20 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా లేదు, పేదల సంక్షేమానికి దోహద పడేలా లేదు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకు, చేతలకు పొంతనే లేదనడానికి ఈ బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం.  ఆదాయ వనరుల పెంపు, ఉత్పాదకత పెంచడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడేలా  ఈ బడ్జెట్ లేదు. సంపద సృష్టి, ఆదాయం పెంపు ముందుచూపు లేని బడ్జెట్ గా ఇది మిగిలింది.


ఏడాదిలోనే 80% మేనిఫెస్టో అమలు చేస్తున్నామని డబ్బాలు కొడతారు. కానీ పథకాలు మాత్రం వచ్చే ఏడాది నుంచి కొన్ని అమలు అంటారు..మరికొన్ని పథకాలు దశలవారీగా అమలు చేస్తారు..ఇంకొన్ని అంశాలు 4 ఏళ్లలో కొద్దికొద్దిగా ఇస్తామంటారు. ఇదేనా ఏడాదిలోనే 80% మేనిఫెస్టో అమలు చేయడం..? 
శ్వేత పత్రంలో ఒకలా చెబుతారు, బడ్జెట్ లో ఇంకోలా పేర్కొంటారు, ఏదేమైనా ఎకనామిక్ సర్వే వాస్తవాలను ఎవరూ కాదనలేరు. 


 శ్వేతపత్రంలో జివిఏ వృద్దిపై, తలసరి ఆదాయంపై హేళనగా మాట్లాడిన ఆర్ధికమంత్రి ఈ రోజు బడ్జెట్ తో పాటు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే చూశారా..? రాష్ట్ర విభజన ఏడాది తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే కేవలం రూ.6వేలు మాత్రమే ఎక్కువ ఉండగా, ఈ రోజు రూ.38 వేలు ఎక్కువ ఉండటం తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ప్రగతి కాదా..? గత 5ఏళ్లలో జాతీయ సూచికలతో పోల్చితే గణనీయంగా రెండంకెల వృద్ది సాధించిందని మీరు విడుదల చేసిన సోషియో ఎకనామిక్ సర్వేనే చెప్పింది. కళ్లుండి చూడలేని కబోధుల్లా వైకాపా నేతల విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. 


ఏం పరిశ్రమలు వచ్చాయని ఎగతాళి చేసే వైకాపా నేతలకు, అదే సర్వేలో ఒక్క గత ఏడాదిలోనే రూ.21వేల కోట్ల పెట్టుబడులతో 1,05,000 ఉద్యోగాల కల్పన జరిగిందని మీ కళ్లకు కనిపించలేదా..? ఒక్క ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలోనే రూ.1,400కోట్ల పెట్టుబడితో 49వేల ఉద్యోగాల కల్పన జరిగిందని మీరు విడుదల చేసిన సర్వే లెక్కలే చెప్పాయి. అభివృద్దిని ఎవరూ దాచలేరు, వాస్తవాలను కప్పెట్టాలని చూసినా దాగదనేది వైకాపా నేతలు గ్రహించాలి. 


రాష్రంహిలో శరవేగంగా నిర్మాణంలో ఉన్న ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో కోతలు విధించడం ద్వారా ప్రగతికి గండికొట్టారు. నీటి పారుదల ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో 22% కోత పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో లేదనేది తేలిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం గత 5ఏళ్లలో జల వనరుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తే, పొరుగు రాష్ట్ర భూభాగంలో నీళ్లు పారించేందుకే వైసిపి ప్రభుత్వం శ్రద్ద పెట్టిందనేది కాదనలేని సత్యం. కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే కేటాయింపులు చేసి మిగిలిన ప్రాజెక్టులకు బడ్జెట్ లో మొండిచేయి చూపడం అందుకు తాజా రుజువు. 


తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలకు 11 వేల కోట్లు పెట్టాల్సి వుండగా, రూ.130 కోట్లు మాత్రమే చెల్లించిందని  ఈ రోజే విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల్లోనే, ఈ బడ్జెట్ లో సున్నా వడ్డీ రుణాలకు రూ.4వేల కోట్లు పెట్టాల్సివుంటే రూ.100కోట్లు మాత్రమే కేటాయించడంపై రైతులకు ఏం సమాధానం చెబుతారు..? ఈ బడ్జెట్ లో రైతులకు అన్యాయం చేసి వచ్చే బడ్జెట్ లో సరిచేస్తామనడం పలాయనవాదం. శీతల గిడ్డంగులు, గోడౌన్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేవలం రూ.200కోట్లు, ఉచిత బోర్లకు రూ.200కోట్లు, పశు బీమాకు రూ. 50కోట్లు అరకొర కేటాయింపులు చేసి, రైతుల ఆదాయాన్ని 4ఏళ్లలో ఎలా రెట్టింపు చేస్తారు?


నిన్న కరవుపై ముఖ్యమంత్రి ప్రకటనలో తాగునీటి గురించి, సుదీర్ఘ ఉపన్యాసాలు దంచి, ఈ రోజు బడ్జెట్ లో తాగునీటికి, పారిశుద్యానికి 15% కేటాయింపులు కోత పెట్టడం దివాలాకోరు తనం కాదా..?


బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారన్న అక్కసుతోనే ఈ బడ్జెట్ లో బిసిలకు కేటాయింపులు తగ్గించారు. 139 ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని మొక్కుబడిగా పేర్కొన్నారే తప్ప వాటికి కేటాయింపులపై స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వేశారు.ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం రూ.1,102 కోట్లు కేటాయించగా,  దానికన్నా 13.56% కోత విధించడం మైనారిటిలను మోసగించడమే. 


డ్వాక్రా మహిళలకు రూ.3,036కోట్ల వడ్డీ బకాయిలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి, ఈ బడ్జెట్ లో కేటాయించింది కేవలం రూ.1,788 కోట్లు మాత్రమే. చెప్పినదానిలో 3వ వంతు మాత్రమే కేటాయించారంటే ఏమనాలి..? డ్వాక్రా మహిళల రుణాల రద్దు, మహిళలకు 5ఏళ్ల పాటు రూ.75వేలు ఇస్తామన్న రెండు అంశాలను ఈ ఏడాదికి ఎగనామం పెట్టారు. వచ్చే ఏడాది నుంచి చేస్తామని, ఈ బడ్జెట్ లో పేర్కొనడం మరో మోసం.


మరింత సమాచారం తెలుసుకోండి: