టీడీపీ వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టీడీపీని వీడేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సాధారణ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయంగా చాలా సైలెంట్‌గా క‌నిపిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చింత‌మ‌నేని ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ వ‌చ్చి త‌న‌పై దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల‌ని... తాను ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని స‌వాళ్లు రువ్వారు. ఎప్పుడైతే ఈ ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని ఓడిపోయారో ? అప్ప‌టి నుంచి ఆయ‌న ఎవ్వ‌రికి క‌న‌ప‌డ‌డం లేదు.


తాజా అప్‌డేట్ ప్ర‌కారం చింత‌మ‌నేని చ‌ర్చ‌లు ఆయ‌న పార్టీ మారేందుకు ఊత‌మిచ్చేలా ఉన్నాయి. ఇప్ప‌ట్లో ఏపీలో టీడీపీ కోలుకోవడం కష్టమన్న భావనతో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తాజాగా చింతమనేని ప్రభాకర్ … విజయవాడలో బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజుతో ఒక హోటల్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించార‌ని తెలుస్తోంది.


గ‌త ప్ర‌భుత్వంలో చింత‌మ‌నేని టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే.. విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. చింత‌మ‌నేని ప్ర‌భుత్వ విప్‌గా ప‌నిచేస్తే... విష్ణుకుమార్ రాజు బీజేపీ విప్‌గా అసెంబ్లీలో వ్య‌వ‌హ‌రించారు. ఇక తాజా భేటీలో బీజేపీలో చేరే అంశంపైనే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు భావిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌పై 30కిపైగా కేసులున్నాయి. 


ఈ కేసుల్లో కొన్నింటికి ఇప్ప‌టికే శిక్ష కూడా ప‌డింది. అయితే చింత‌మ‌నేని బెయిల్‌పై తిరుగుతున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక కూడా ఆయ‌న‌పై కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్తే రక్షణ దొరుకుతుందని చింతమనేని భావిస్తున్నట్టు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: