ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రాణం పోసుకుని, అతి త‌క్కువ స‌మ‌యంలోనే సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారిన టీవీ 9 ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని భాష‌ల్లోనూ ప్ర‌జ‌ల‌కుచేరువ అయింది. ఈ ఛానెల్‌ను అతి త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేసిన ఘ‌న‌త, ఛానెల్‌ను నిర్వ‌హించి, ప్ర‌జ‌ల నోళ్ల‌పై నానేలా చేసిన ఘ‌న‌త కూడా ఈ ఛానెల్‌కు అప్ప‌ట్లో సీఈవోగా చేసిన ర‌విప్ర‌కాష్‌కే ద‌క్కుతుంది. ప్ర‌తి క్ష‌ణం.. సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా, లైవ్‌ ప్ర‌సారాల‌కు కేరాఫ్‌గా ఆయ‌న న‌డిపించారు. అయితే, ఇటీవ‌ల తీవ్ర వివాదం నెల‌కొన్న నేప‌థ్యం, ఈ ఛానెల్‌ను వేరేవారికి ఆమ్మేసిన నేప‌థ్యంలో ర‌వి ప్ర‌కాష్ తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యారు. 


ముఖ్యంగా కొత్త య‌జ‌మానుల‌తో కూడిన బోర్డు స‌మావేశాల‌కు అడ్డుప‌డ‌డం, త‌న షేర్ల‌ను విక్ర‌యించ‌డం, టీవీ 9 లోగోను కూడా అమ్ముకున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో ర‌వి ప్ర‌కాష్‌పై కేసు కూడా న‌మోదైంది. ఇది దాదాపు ఆరెస్టు వ‌ర‌కు కూడా దారితీసింది. అయితే, బెయిల్ కోసం ర‌విప్ర‌కాష్ కోర్టును ఆశ్ర‌యించ‌డం, పోలీసుల‌ విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డంతో వివాదం స‌ర్దుమ‌ణిగినా.. కేసు మాత్రం కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే ర‌విప్ర‌కాష్‌.. త‌న దూకుడు పెంచార‌ని తెలుస్తోంది. తానే సొంతంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించాల‌ని తాజాగా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. 


ఏ ఛానెల్‌ను అయితే, తాను క‌న్న‌బిడ్డ‌ క‌న్నా ఎక్కువ‌గా భావించి అభివృద్ధి చేశారో.. ఏ ఛానెల్‌ను దేశంలోనే ఫ‌స్ట్‌ప్లేస్‌లో నిల‌బెట్టారో.. అలాంటి టీవీ9 ఛానెల్‌కు స‌మాంత‌రంగా అదే రేంజ్‌లో అదే వేగంతో అంతే స్థాయిలో నూత‌నంగా మ‌రో ఛానెల్‌ను తీసుకువ‌చ్చేందుకు ర‌వి ప్ర‌కాష్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ఉద్యోగ నియామ‌కాలు కూడా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని స‌మాచారం.
నిజానికి తెలుగు ఛానెళ్ల‌లో అత్యంత వేగంగా వార్త‌లు అందించ‌డంలోనూ, సంచ‌ల‌నాత్మ‌క విశ్లేష‌ణ‌లు ఇవ్వ‌డంలోనూ టీవీ 9 మంచి పేరు తెచ్చుకుంది. అయితే, త‌న‌ను ఉద్దేశ పూర్వ‌కంగా టీవీ9 కొత్త మాజ‌మాన్యం సీఈవో ప‌ద‌వి నుంచి బ‌య‌ట‌కు పంప‌డంతో ర‌వి ప్ర‌కాష్ ర‌గిలిపోతున్నారు. పైగా త‌న‌పై కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు, జైలుకు పంపాల‌ని కూడా నిర్ణ‌యించుకోవ‌డంపై ర‌విప్ర‌కాష్ ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో ఆయ‌న ఎలాగైనా స‌రే టీవీ9కు స‌మాంత‌రంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించి, అంతే రేంజ్‌లో దానిని తీర్చిదిద్ది, టీవీ9కు షాక్ ఇవ్వాల‌న్న‌ నిర్ణ‌యానికి వ‌చ్చారు.


ప్ర‌స్తుతం టీవీ9లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది సంహ‌భాగం ర‌వి ప్ర‌కాష్ చేసిన నియామ‌కాల‌తోనే ఉద్యోగాలు పొందారు. సో.. ఇప్పుడు ర‌వి ప్ర‌కాష్ కొత్త ఛానెల్‌ను ప్రారంభిస్తే వీరంతా టీవీ9కు బై చెప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. టీవీ9 ఇబ్బందుల్లో ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  ర‌వి ప్ర‌కాష్ ఏ విధంగా గోడ‌కు కొట్టిన బంతిలా.. టీవీ9 యాజ‌మాన్యంపై క‌సితీర్చుకుంటారా ?  లేదా టీవీ 9 దూకుడు ముందు త‌లొగ్గుతారా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: