అధికార పీఠంలోకి ఎక్కింది మొద‌లు.. నేటి వ‌ర‌కు దిన‌దిన గండంగా మారిన క‌ర్ణాట‌క‌లోని కుమార స్వామి సంకీర్ణ స‌ర్కారు.. నేడు కూలిపోయింది. గ‌డిచిన నాలుగు రోజులుగా అత్యంత నాట‌కీయ ప‌రిణామాలు చేటు చేసుకున్న‌ప్ప‌టికీ.. చిట్ట‌చివ‌రికి వ‌చ్చే స‌రికి మంగ‌ళ‌వారం స్పీక‌ర్ నిర్ణ‌యం మేర‌కు కుమార దిగిరాక త‌ప్ప‌లేదు. దీంతో స‌భ‌లో నిర్వ‌హించిన మూజువాణి ఓటుతో విశ్వాస ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. విశ్వాస ప‌రీక్ష నిర్వ‌హించే స‌మ‌యానికి స‌భ‌లో బీజేపీకి చెందిన 105 మంది స‌భ్యులు, కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి స‌భ్యులు స్పీక‌ర్‌తో క‌లిపి 100 మంది ఉన్నారు. అయితే, వీరిలో 99 మంది మాత్ర‌మే కుమార ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఓటు వేయ‌గా.. మిగిలిన 105 మంది బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో విశ్వాస ప‌రీక్ష‌లో మేజిక్ ఫిగ‌రైన 103కు చేరుకోని కార‌ణంగా కుమార ప్ర‌భుత్వం కూలిపోయింది. 


గ‌త ఏడాది మేలో జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఏ పార్టీకీ విస్ప‌ష్ట‌మైన తీర్పు ఇవ్వ‌లేదు. అయితే, బీజేపీని మాత్రం అతిపెద్ద పార్టీగా నిల‌బెట్టా రు. మొత్తం 224 మంది ఉన్న క‌ర్నాట‌క అసెంబ్లీలో అధికారం చేప‌ట్టేందుకు మేజిక్ ఫిగ‌ర్ 113 మంది స‌భ్యుల అవ‌స‌రం ఉంది. అయితే, బీజేపీకి సొంతంగానే 105 మంది స‌భ్యుల బ‌లం వ‌చ్చినా.. అధికారంలోకి వ‌చ్చేందుకు మాత్రంలో మ‌రో ఎనిమిది మంది స‌భ్యుల అవ‌స‌రం ఏర్ప‌డింది. అయి తే, ఎట్టి ప‌రిస్థితిలోనూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రానిచ్చేది లేద‌ని పంతం ప‌ట్టిన కాంగ్రెస్ గ‌త వైరాన్ని కూడా కాద‌ని, కేవ‌లం 34 మంది స‌భ్యుల‌ను గెలుచుకున్న జేడీఎస్‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. పైగా సీఎం సీటును అతి త‌క్కువ సంఖ్యాబ‌ల‌మే ఉన్న‌ప్ప‌టికీ.. జేడీఎస్ చీఫ్‌ కుమార స్వామికే అప్ప‌గించింది. అయితే, బీజేపీకి అనుకూల గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ఉండ‌డంతో తొలుత ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకునే అవ‌కాశం బీజేపీకే ద‌క్కింది. 


దీంతో సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో మేజిక్ ఫిగ‌ర్‌కు త‌క్కువ‌గా ఉన్న 8 మంది స‌భ్యుల‌ను ఇత‌ర పార్టీల నుంచి చేర్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నించినా అప్ప‌ట్లో సాధ్యం కాలేదు. దీంతో నాలుగు రోజుల్లోనే ఆయ‌న త‌న ప్ర‌భుత్వానికి సంఖ్యా బ‌లం లేద‌ని పేర్కొంటూ.. రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ల కూట‌మి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చింది. కుమార స్వామి సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అయితే, కుమార ప్ర‌భుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర‌స్థాయిలో త‌ల‌నొప్పులు వ‌చ్చాయి. దీనికితోడు ఎప్పుడెప్పుడు ప్ర‌భుత్వాన్ని కూల్చేద్దామా? అని కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు కూడా ప‌ట్టు చిక్కించుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు వేస్తూ.. వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే అసంతృప్తుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పారు. 


ఈ క్ర‌మంలో ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థుల రాజీనామాల‌తో ప్రారంభ‌మైన ఈ త‌తంగం మొత్తం.. దాదాపు 19 మంది కాంగ్రెస్‌ స‌భ్యులు త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. దీంతో స‌భ‌లో కుమార ప్ర‌భుత్వానికి సంఖ్యా బ‌లం త‌గ్గిపోయింది. ఈ నేప‌థ్యంలోనే కుమార ప్ర‌భుత్వం తాజాగా కుప్ప‌కూలింది. త‌న ప్ర‌భుత్వాన్ని నిలుపుకొనేందుకు తుదికంటా కుమార స్వామి అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా కూడా ఆయ‌న వ్యూహాలు ఎక్క‌డా ఫ‌లించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి కేంద్రంలోని క‌మ‌ల నాథులు క‌ర్నాట‌క రాజ‌కీయాల‌పై పైచేయి సాధించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: