ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది తెలంగాణ మంత్రుల ప‌రిస్థితి. ప‌ద‌వులున్నాయి. కేటాయించిన శాఖ‌లున్నాయి. కానీ.. చేయ‌డానికి ప‌నిమాత్రం లేదు. స‌మీక్ష‌లు లేవు.. ఏం చేస్తే మ‌రేం జ‌రుగుతుందోన‌నే భ‌యంతో మంత్రులు వ‌ణికిపోతున్నారు. హాయిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన ప‌ని చేసి, ఏమైనా చిన్న‌ప‌నులు ఉంటే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి సైలెంట్‌గా ఉండిపోతున్నారు. సంబంధిత శాఖ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తినా మంత్రులు మాట్లాడ‌డం లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దాదాపుగా ఒక‌రిద్ద‌రు మంత్రులు త‌ప్ప మిగ‌తా మంత్రుల ప‌రిస్థితి అంతా భ‌యంభ‌యంగానే క‌నిపిస్తోంది. 


నిజానికి.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ తిరుగులేని విజ‌యం సాధించిన త‌ర్వాత చాలా రోజుల పాటు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌లేదు. ఆ త‌ర్వాత కొద్దిమందితోనే సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో హ‌రీశ్‌రావుతోపాటు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా స్థానం ద‌క్క‌లేదు. అయితే.. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. కేటీఆర్ పార్టీవ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ద‌క్కింది కానీ.. హ‌రీశ్‌రావును కేసీఆర్ ప‌క్క‌న పెట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది. 


ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుత మంత్రులంద‌రూ దాదాపుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఏవో చిన్న‌చిన్న ప‌నులు చేస్తూ.. నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవుతున్నారు. తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌తో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగారు. కానీ.. విద్యాశాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి క‌నీసం మాట్లాడ‌లేదు. సైలెంట్‌గా ఉండిపోయారు. నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయి.. ఉండిపోయారు.


ఇక ఈట‌ల రాజేంద‌ర్‌కూడా నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయి ఉంటున్నారు. పెద్ద‌గా హ‌డావుడి క‌నిపించ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆర్థిక‌శాఖ మంత్రిగా కొంత చురుగ్గానే క‌నిపించారు. ఈసారి మాత్రం ఆయ‌న నోవ‌ర్క్ మోడ్‌లో ఉండిపోతున్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాత్రం సొంత జిల్లా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో కొంత హ‌డావుడి చేస్తున్నారు. ఇక హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ కూడా ఎప్ప‌టిలాగే సైలెంట్‌గా ఉంటున్నారు. శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, మ‌ల్లారెడ్డిలు ఏం చేస్తున్నారో కూడా ఏం చేస్తున్నారో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. మంత్రివ‌ర్గ‌మంతా స్త‌బ్దుగా ఉండిపోతుంది. 


క‌నీసం.. వారి వారి శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. అయితే.. మ‌రికొద్ది రోజుల్లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత మంత్రుల్లో ఎంద‌రు ఉంటారో.. ఎంద‌రు పోతారో.. అనే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిణామాలు మంత్రుల్లో వ‌ణుకుపుట్టిస్తున్నాయి. ప‌ద‌వులు ఉంటాయో.. ఊడుతాయోన‌ని లోలోప‌ల తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: