గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన  శేరిలింగంప‌ల్లి జోన్ ప‌రిధిలో భారీ వ‌ర్షాల వ‌ల్ల ముంపుకు గురికాకుండా ఉండేందుకు రూ. 70 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన డ్రెయిన్‌ల నిర్మాణం, నాలాల విస్త‌ర‌ణ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆదేశించారు. శేరిలింగంప‌ల్లి జోన్ ప‌రిధిలో ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నులు, డ్రెయిన్‌ల నిర్మాణం త‌దిత‌ర ప‌నుల‌పై  శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌, చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్‌, చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, భూసేక‌ర‌ణ అధికారి విక్ట‌ర్ త‌దిత‌ర అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశాన్ని శనివారం సాయంత్రం నిర్వ‌హించారు. శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ స‌మావేశానికి ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు.


శేరిలింగంప‌ల్లి ప‌రిధిలో దాదాపు రూ. 70 కోట్ల వ్య‌యంతో స్ట్రామ్ వాట‌ర్ డ్రెయిన్‌ల నిర్మాణం, నాలా విస్త‌ర‌ణ ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయ‌ని, వీటికి తోడు మ‌రో 10కోట్ల రూపాయ‌ల‌ను కొత్త‌గా స్ట్రామ్ వాట‌ర్ డ్రెయిన్‌ల నిర్మాణానికి మంజూరు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం పురోగ‌తిలో ఉన్న రూ. 70కోట్ల ప‌నుల‌కు సంబంధించి గ‌త రెండేళ్లుగా స్వ‌ల్ప కార‌ణాల వ‌ల్ల ముందుకు సాగ‌డంలేద‌ని, ఇందుకు బాధ్యులుగా వెస్ట్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ మోహ‌న్‌రెడ్డిని చేస్తూ ఆయ‌న‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ప్ర‌క‌టించారు. ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ ఐటి కంపెనీలు, ఇత‌ర బ‌హుళ జాతి కంపెనీలు ఉన్న శేరిలింగంప‌ల్లి జోన్‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇస్తోంద‌ని, ఈ కీల‌క‌ ప్రాంతంలో విధుల నిర్వ‌హ‌ణ ప‌ట్ల తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం ద్వారా స్థానిక ప్ర‌జానికానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు.


బాక్స్ డ్రెయిన్‌ల నిర్మాణానికి అడ్డంకులుగా ఉన్న భూ, ఆస్తుల సేక‌ర‌ణ‌కు సంబంధించి వెంట‌నే ఎల్‌.ఏ నోటిఫికేష‌న్ జారీచేయ‌డంతో పాటు ప్ర‌త్యామ్న‌య మార్గాల‌ను కూడా వెంట‌నే అన్వేషించాల‌ని ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. దుర్గం చెరువు నుండి వ‌చ్చే నాలా రీటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇత‌ర నాలాల రీటైనింగ్ వాల్ నిర్మాణాల‌కు వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌ను ఆదేశించారు. శేరిలింగంప‌ల్లి ప‌రిధిలో అప్ర‌తిహాతంగా పెరుగుతున్న బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల నిర్మాణాల‌తో వ‌ర్ష‌పునీరు, సీవ‌రేజ్‌ డ్రెయిన్‌ల నిర్మాణాలను చేప‌ట్టేందుకు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో డ్రెయిన్‌ల ప్ర‌క్క‌నే చేప‌ట్టే అపార్ట్‌మెంట్‌, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, విల్లాల య‌జ‌మానులే త‌మ ప్ర‌క్కనే ఉన్న డ్రెయిన్‌ల‌కు రీటైనింగ్ వాల్‌ను విధిగా నిర్మించేలా భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల్లో శ‌ర‌తులు విధించాల‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.


ప్ర‌స్తుతం న‌గ‌రంలోని ప‌లు చెరువులు, కుంట‌ల‌కు స‌మీపాల్లో చేప‌డుతున్న భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించి 2012 నాటి నిర‌భ్యంత‌ర ప‌త్రాల‌ను (ఎన్‌.ఓ.సి) లేక్ ప్రొట‌క్ష‌న్ క‌మిటీల నుండి తెస్తున్నార‌ని, అయితే ఇటీవ‌ల ప‌లు చెరువులు, కుంట‌ల‌కు సంబంధించి పూర్తి నీటి మ‌ట్టాల (ఎఫ్‌.టి.ఎల్‌)ల‌ను కొత్త‌గా నిర్థారించినందున సంబంధిత లేక్ ప్రొట‌క్ష‌న్ క‌మిటిల నుండి 2018 అనంత‌రం నిర్థారించిన ఎఫ్.టి.ఎల్‌ను అనుస‌రించి ఎన్‌.ఓ.సిల‌ను స‌మ‌ర్పించేలా టౌన్‌ప్లానింగ్ నిబంధ‌న‌లో మార్పుల‌ను చేప‌ట్టాల‌ని దాన‌కిషోర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: