తెలుగు రాజకీయాలకు సెంటిమెంట్లకు అవినాభావ సంబంధం ఉంది. ఒక సెంటిమెంట్ పదే పదే రిపీట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో విపక్ష టిడిపి 23 ఎమ్మెల్యే... 3 ఎంపీ సీట్లతో సరిపెట్టుకున్న‌ సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు... 23 మంది ఎమ్మెల్యేల‌ను ఆపరేషన్ ద్వారా తమ పార్టీలోకి లాగేసుకున్నారు. చివరకు చంద్రబాబుకు అంతే మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ సెంటిమెంట్‌ను వైసిపి వాళ్ళు ఓ రేంజ్ లో వాడుకొని నానా రచ్చ రచ్చ చేశారు.


చంద్రబాబు పతనానికి ఆయన సీఎంగా ఉండగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న‌ భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతోనే  బీజం పడింది. అప్పుడే ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేశారు. దివంగత భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్నారు. తొలి రెండు సంవత్సరాలు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ టైంలో భూమాపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంతో ఆయన ఆ ఒత్తిళ్లు త‌ట్టుకోలేక‌ చివరకు టిడిపిలో చేరిపోయారు.


భూమా మంత్రి పదవి ఆశతో టిడిపిలో చేరినా ఆయన హఠాన్మరణంతో ఆ ఆశ తీరలేదు. చివరకు ఆయనకు దక్కాల్సిన మంత్రి పదవి ఆయన కుమార్తె అఖిల‌కు దక్కింది. భూమా పార్టీ వీడాక ఆ పదవి అప్పుడు వైసీపీలో ఎవరికి దక్కుతుందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చివరకు జగన్ ఆ పదవిని ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఏకంగా ఆర్థిక మంత్రి అయ్యారు.


ఇప్పుడు చంద్రబాబు అదే పీఏసీ ప‌ద‌విని తన సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ కు ఇచ్చారు.వాస్తవంగా పయ్యావుల పార్టీ మారిపోతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పయ్యావులకు పీఏసీ పదవి ఇవ్వటం ద్వారా చంద్రబాబు ఆయనను తన అదుపులో ఉంచుకున్నార‌న్న టాక్‌ కూడా టిడిపి వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలకు ముందే జగన్ దూత‌ల‌ నుంచి పయ్యావులకు ఆఫర్ వెళ్ళింది. వైసీపీలోకి వెళితే ఉరవకొండ ఎమ్మెల్యే టికెట్ తో పాటు... మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారు. 


చివ‌ర‌కు ప‌య్యావుల సీమ‌లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరిగా మిగిలారు. ప‌య్యావుల గెలిచారు... పార్టీ ఓడింది. చివ‌ర‌కు ఆయ‌న‌కు ప‌ద‌వి లేకుండా పోయింది. ఇప్పుడు పార్టీ మార‌దాం ? అన్న ఆలోచ‌న ఉన్నా వైసీపీలోకి వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కండిషన్ ఉంది. ఈ క్ర‌మంలోనే ప‌య్యావుల ప‌క్కదారి చూడ‌కుండా ఉండేందుకే బాబు ఆయ‌న‌కు కేబినెట్ హోదా ఉన్న ఈ కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఎంతోమంది సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. బిసి లేదా కాపు ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి ఈ పదవి వస్తుందని అనుకున్నా చివరకు చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన కేశ‌వ్‌కు ఈ పదవి కట్టబెట్టారు. 


జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఇదే పీఏసీ పదవి ఉన్న వ్య‌క్తిని లాక్కోవ‌డంతోనే చంద్ర‌బాబు డౌన్ అయ్యారు. ఇప్పుడు ఏపీలో ఇన్ని స‌మీక‌ర‌ణ‌ల యుద్ధం న‌డుస్తోన్న వేళ మ‌ళ్లీ అదే పీఏసీ ప‌ద‌వి విష‌యంలో ఆయ‌న రాంగ్ స్టెప్ వేశార‌న్న టాక్ వ‌చ్చింది. ఇన్ని చేసినా ప‌య్యావుల చివ‌రి వ‌ర‌కు పార్టీలోనే ఉంటాడా ?  బాబు వెంటే న‌డుస్తాడా ? అన్న‌ది కూడా డౌటే అన్న‌ది టీడీపీలోనే వినిపించే మాట‌. పీఏసీ విష‌యంలో పాత సెంటిమెంట్ రిపీట్ అయితే ప‌య్యావుల కూడా పార్టీ మార‌డ‌మే మిగిలి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: