మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయమైన సంగతి తెలిసిందే.. జగన్ సర్కారు కొలువు దీరి రెండు నెలలు కావస్తోంది. అయితే అప్పుడే టీడీపీ నేతలు వైసీపీపాలనపై విమర్శలుతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ రోజూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు..


తాజాగా చంద్రబాబు.. ఉద్యోగులపై జగన్ సర్కారు నిర్లక్ష్యాన్ని ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.. చిన్న ఉద్యోగులను జగన్ సర్కారు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు..


గత 5 ఏళ్లలో చిరుద్యోగులు ఎప్పుడూ ఈవిధంగా రోడ్డెక్కలేదంటున్నారు.. ఉన్నంతలో అందరి సంక్షేమానికి బాటలు పరిచామన్నారు.. ఇప్పుడు ఈవిధంగా ఉద్యోగ భద్రతకోసం వారు పోరాటం చేయాల్సిరావడం దురదృష్టకరం. వారి పోరాటంలో తోడుగా మేమున్నామని భరోసా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నాను..అంటూ చంద్రబాబు మొన్న ట్వీట్ చేశారు.


తాజాగా మరో ట్వీట్ ద్వారా.. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తీసేసి, కొత్తవాళ్ళను తెచ్చుకోవడం, వాటికే ఉద్యోగాల కల్పన అని పేరుపెట్టుకోవడం ఏం పిచ్చిపనో నాకర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఔట్ సోర్సింగ్ వాళ్ళను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టు ? అని ప్రశ్నించారు చంద్రబాబు..


చంద్రబాబు ట్వీట్లపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల గొంతునొక్కడం వల్లే చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి జారిపడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మీ రాక్షస పాలనలో ఉద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు. అంగన్‌వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.


అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గుండాల్లా దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడిందని గుర్తు చేశారు. మొత్తానికి ఉద్యోగులను ఇబ్బంది పెట్టినందుకే చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోయారని విజయసాయి రెడ్డి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: