ఏకకాలంలో మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతిని క్రిమినల్‌ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కు ఊహించ‌ని బ్రేక్ ప‌డింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముస్లిం మ‌హిళ‌ల‌కు మూడుసార్లు త‌లాక్ చెబితే.. కొత్త చ‌ట్టం ప్ర‌కారం భ‌ర్త‌ల‌కు మూడేళ్ల జైలు శిక్ష‌ను విధించ‌నున్నారు. గతవారమే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, మంగ‌ళ‌వార‌మే వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఆమోదం లభించింది. బీజేడీ మద్దతుగా నిలువడం, మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకే వాకౌట్‌ చేయడం, పలువురు విపక్ష సభ్యుల గైర్హాజరు నేపథ్యంలో ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న పెద్దల సభలో అధికార బీజేపీ సునాయాసంగా గట్టెక్కింది.  మోదీ ప్ర‌భుత్వం రూపొందించిన ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఓకే చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఆ బిల్లు చ‌ట్ట‌రూపం దాల్చ‌నుంది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

కేరళకు చెందిన జమియాతుల్ ఉలేమా సంస్థ  ట్రిపుల్ తలాక్ చట్టంలోని నేరంగా పరిగణించే అంశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తలాక్ చట్టంపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని 14,15,21 ప్రకరణలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచార‌ణ చేప‌ట్టాల్సి ఉంది. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లో బిల్లు పాసైన నేప‌థ్యంలో శుక్ర‌వారం రాష్ట్ర‌ప‌తి త‌క్ష‌ణ తలాక్ ర‌ద్దు బిల్లుకు త‌న ఆమోదం తెలిపారు. ఈ విష‌యంపై త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా  స్పందించారు. పార్ల‌మెంట్‌లో బిల్లుకు ఆమోదం ద‌క్కిన‌ట్లు పేర్కొన్నారు. లింగ స‌మాన‌త్వం కోసం జ‌రుగుతున్న పోరాటంలో ఇదో మైలురాయి అన్నారు. యావ‌త్ దేశం సంతోష‌ప‌డే క్ష‌ణం ఇద‌ని రామ్ నాథ్ ట్వీట్ చేశారు.  ఒకేరోజు రాష్ట్రప‌తి ఆమోదం, సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: