టీడీపీ జూనియర్‌ నేత, ఇటీవల ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయం విజయవాడ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టించింది. విజయవాడ సింహంగా పేరు తెచ్చుకున్న దివంగత దేవినేని రాజశేఖర్‌ ఉరఫ్‌ నెహ్రూ వారసుడిగా 2014లోనే రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్‌.. అప్పటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కాంగ్రెస్‌టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 


తండ్రి ప్రోద్బలం, ఆయనకున్న రాజకీయ పలుకుబడి కూడా దేవినేనికి కలిసి వచ్చినా.. రాష్ట్ర విభజన తాలూకు ఫలితంతో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక, తర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిన నేపథ్యంలో దేవినేని నెహ్రూ.. కాంగ్రెస్‌ నుంచి జంప్‌ చేసి టీడీపీలోకి వచ్చారు. వాస్తవానికి టీడీపీతోనే రాజకీయాలు ప్రారంభించిన ఈ కుటుంబం అన్నగారు ఎన్టీఆర్‌కు అత్యంత నమ్మకమైన కుటుంబంగా ఎదిగింది. ఇక, రాజకీయాల్లో విజయవాడ కేంద్రంగా దేవినేని వర్సెస్‌ వంగవీటి వ్యూహ ప్రతివ్యూహాలు, దాడులు, ఘర్షణలు వంటివి తెలిసిందే. 


కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పార్టీ మారిన దేవినేని నెహ్రూ.. తర్వాత కొన్నాళ్లకే అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత అవినాష్‌.. తండ్రి ప్లేస్‌ను ఆక్రమించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయననురాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా నియమించారు. కొన్నాళ్లలోనే వచ్చిన 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్‌ కోసం ప్రయత్నించిన అవినాష్‌కు ఎక్కడా ఖాళీలేక పోవడంతో ఏరికోరి గుడివాడను కేటాయించారు. అక్కడ వైసీపీ నాయకుడు, మాజీటీడీపీ నేత ఫైర్‌ బ్రాండ్‌ రాజకీయాలకు పెట్టింది పేరైన కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఉరఫ్‌ నానిపై అవినాష్‌ పోటీ చేశారు. 


అయితే, స్థానికుడు కాకపోవడం, జగన్‌ సునామీ ముందు అవినాష్‌ ఓటమి పాలయ్యారు. నిన్న మొన్నటి వరకు కూడా అవినాష్‌ వైసీపీపై విమర్శలు సంధించారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థికి.. అంటే ఒక తల్లికి ఎందరు బిడ్డలు ఉన్నా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి ఇలా సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆయన టీడీపీకి రాజీనామా చేశారనే వార్త వెలుగు చూడడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించినట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: