గ్రేటర్ హైదరాబాద్ లో  గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల ర‌హ‌దారుల‌పై 4వేల గుంత‌లు (పాట్ హోల్స్‌) ఏర్ప‌డగా 987 ర‌హ‌దారులు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్ అధికారులు నిర్వ‌హించిన‌ ప్రాథ‌మిక స‌ర్వేలో తేలింది. ఈ గుంత‌ల‌ను పూడ్చ‌డంతో పాటు దెబ్బ‌తిన్న మార్గాల‌ను వెంట‌నే పున‌రుద్ద‌రించ‌డానికి రూ. 50 కోట్లను మంజూరు చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది.
 న‌గ‌రంలో భారీ వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న రోడ్లను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ లు శనివారం ఉద‌యం హైదరాబాద్ లో విస్తృతంగా ప‌ర్య‌టించి పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. అనంత‌రం జీహెచ్ఎంసీ కార్యాల‌యం నుండి జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ వీడియో కాన్ఫ్‌రెన్స్ ద్వారా వ‌ర్షాల వ‌ల్ల ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ..  హైద‌రాబాద్ న‌గ‌రంలో జీహెచ్ఎంసీ సీనియ‌ర్ అధికారులు, ఇంజ‌నీరింగ్ అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి నిర్వ‌హించిన స‌ర్వేలో 4వేల‌కు పైగా రోడ్ల‌పై గుంత‌లు ఏర్ప‌డ్డాయ‌ని, 987 ప్ర‌ధాన, అంత‌ర్గ‌త ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయ‌ని నివేదిక స‌మ‌ర్పించార‌ని పేర్కొన్నారు. 

దెబ్బ‌తిన్న రోడ్ల‌ను రూ. 50కోట్ల వ్య‌యంతో వెంట‌నే పున‌రుద్ద‌రించేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించామ‌ని తెలిపారు. ఇందుకుగాను నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారంగా ఒక రోజు టెండ‌ర్ల‌ను పిలువాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో ప్ర‌స్తుతం ఉన్న 150 మాన్సూన్ రిలీఫ్ బృందాలతో రెండు రోజుల్లోగా రోడ్ల‌పై గుంత‌ల‌ను పూడ్చివేయాల‌ని, ఈ బృందాలు మూడు షిఫ్ట్‌ల్లో 24 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆదేశించిన‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. ఇటీవ‌ల పి.పి.ఎంలో భాగంగా నిర్మించిన 600 కిలోమీట‌ర్ల రోడ్డు మార్గాల్లో పునరుద్ద‌ర‌ణ ప‌నుల‌ను సంబంధిత కాంట్రాక్ట‌ర్లే నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని, ఈ విష‌యంలో పి.పి.ఎం రోడ్డు వేసిన కాంట్రాక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త రెండు రోజులుగా కురిసిన వ‌ర్షాల వ‌ల్ల న‌గ‌రంలో ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నులు న‌డుస్తున్న మార్గాల్లో రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు గాను ప్ర‌త్యేకంగా మూడు కోట్లు కేటాయిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్ట‌డానికి ష‌ల్మాక్ మిశ్ర‌మంతో చేప‌ట్టాల‌ని, ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ వ‌ద్ద వెయ్యి బ్యాగుల ష‌ల్మాక్ మిశ్రమం సిద్దంగా ఉంద‌ని, మ‌రో రెండు వేల ష‌ల్మాక్ బ్యాగుల మిశ్ర‌మాన్ని వెంట‌నే తెప్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. న‌గ‌రంలో 150 ఎం.ఆర్‌.టి బృందాల ద్వారా చేప‌ట్టే మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను విజిలెన్స్ విభాగంతో పాటు సీనియ‌ర్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ నిర్వ‌హిస్తున్న ర‌హ‌దారుల్లో 236 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ‌తిన్నాయ‌ని గ‌ర్తించార‌ని, వాటిని కూడా హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఈ వ‌ర్షాల వ‌ల్ల న‌ల్లాల ద్వారా స‌ర‌ఫ‌రాచేసే త్రాగు నీరు క‌లుషితం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జ‌ల‌మండ‌లి అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో పురాత‌న భ‌వ‌నాలతో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల భ‌వ‌నాల ప‌టిష్ట‌త‌పై త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల‌ను ఆదేశించారు.


న‌గ‌రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో దెబ్బ‌తిన్న రోడ్ల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ నేడు ఉద‌యం వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి స్వ‌యంగా ప‌రిశీలించారు. బేగంపేట్, శ్యాంలాల్ బిల్డింగ్‌, ప‌రేడ్ గ్రౌండ్స్‌, సికింద్రాబాద్ స్టేష‌న్‌, క‌వాడిగూడ‌, గాంధీ ఆసుప‌త్రి ప్ర‌ధాన మార్గం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, గాంధీన‌గ‌ర్‌, ఇందిరాపార్కు త‌దిత‌ర ప్రాంతాల్లోని ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను ప‌రిశీలించారు. జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ జె.శంక‌ర‌య్య‌ల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సికింద్రాబాద్ స్టేష‌న్ వ‌ద్ద ప‌లు దుకాణ‌దారులు వ్య‌ర్థాల‌ను రోడ్ల‌పై వేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసి జ‌రిమానాలు విధించాల్సిందిగా ఆదేశించారు. కాగా జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు అద్వైత్‌కుమార్ సింగ్‌, శృతిఓజా, సందీప్‌జా, కెన‌డిల‌తో పాటు చీఫ్ ఇంజ‌నీర్లు సురేష్‌కుమార్‌, జియాఉద్దీన్‌, శ్రీ‌ధ‌ర్‌లు క్షేత్ర‌స్థాయిలో జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో ప‌ర్య‌టించి వ‌ర్షాల వ‌ల్ల ఏర్ప‌డ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేశారు. త‌క్ష‌ణం చేప‌ట్టాల్సిన పున‌రుద్ద‌ర‌ణ, మ‌ర‌మ్మ‌తుల‌పై ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
డిజాస్ట‌ర్ బృందాల సేవ‌లు ప్ర‌శంస‌నీయం.


గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల కూలిన చెట్ల‌ను వెంట‌నే తొల‌గించ‌డం, నీటి నిల్వ‌లు ఏర్ప‌డ‌కుండా చ‌ర్య‌లను జీహెచ్ఎంసీ డిజాస్ట‌ర్ రిలీఫ్ బృందాలు వెంట‌నే చేప‌ట్ట‌డంపై న‌గ‌ర‌వాసులు అభినంద‌న‌లు వ్య‌క్తం చేశారు. నేడు ఒక్క‌రోజే వివిధ ప్రాంతాల్లో 30 భారీ వృక్షాలు కూల‌గా వాటిని స‌కాలంలో తొల‌గించి రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు కాకుండా చేయ‌డంలో డి.ఆర్‌.ఎఫ్ బృందాలు కృషిచేశాయి. వీటితో పాటు న‌గ‌రంలోని 40కి పైగా ప్రాంతాల్లో ఏర్ప‌డ్డ నీటి నిల్వ‌ల‌ను వెంట‌నే తొల‌గించ‌డంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌కుండా చేప‌ట్ట‌డంలో విజ‌య‌వంత‌మ‌య్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: