ఒకప్పుడు వామపక్ష పార్టీలు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రనే పోషించేవి. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పడు, 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక, చివరికి 2009లో కూడా టీడీపీతో పొత్తుతో తమ ఉనికిని ఘనంగానే చాటుకున్నాయి. రాను.. రానూ ఆ పార్టీలు కేవలం ఉద్యమాలు చేసేందుకే పరిమితమైపోయాయి. మొన్నటి ఎన్నికల్లో జనసేనతో పొత్తు లాభిస్తుందనుకున్నా తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో జనసేన – వామపక్షాలు అనధికారికంగా విడిపోయాయి.

 

పాతికేళ్ల క్రితం వరకూ పదుల్లో సీట్లు సాధించిన వామపక్షాలు ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితులకు వచ్చేశాయి. తెలంగాణలో కాస్తో కూస్తో ఉనికి చాటుకుంటున్నా ఏపీలో పరిస్థితి మరీ  ఘోరంగా తయారైంది. సీనియర్ నాయకులు తప్పితే కొత్త నాయకత్వాన్ని తయారు చేయలేకపోవడం, యువతలో ఆదరణ లేకపోవడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. జనసేనతో పొత్తుతో ఒకటో, రెండో సీట్లు వస్తాయని భావించారు పార్టీ నాయకులు. వాస్తవ పరిస్థితుల్లో మాత్రం జనసేన కానప్పుడు పొత్తైనా సరే ఓటు వేసేది లేదంటూ ప్రజలు వామపక్షాలను తిరస్కరించారు. జనసేనను కూడా తిరస్కరించారనుకోండి..! దీంతో.. అప్పటి వరకూ కలిసున్న జనసేన, వామపక్ష నాయకులు ఎన్నికల తరువాత కలిసిందిలేదు. ఇంకా.. జనసేనతో పొత్తు పెట్టుకుని తాము నష్టపోయామని వామపక్షాలు గుసగుసలాడుకుంటున్నాయి. కనీస ఓట్లు సాధించలేదని నిర్ధారించుకున్నాయి. ప్రత్యక్షంగా కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం రెండు పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై ఎవరికి వారు విడివిడిగా విమర్శలు చేస్తున్నారు. పోరాటాలు చేస్తామంటున్నారే కానీ ముగ్గురం కలిసి పోరాడుతామని ఎక్కడా మాట రాలేదు. పవన్ కూడా వామపక్ష నాయకులతో ఈమధ్య కలిసిందిలేదు. పవన్ పేరును వామపక్ష నాయకులు స్మరించిందిలేదు. మరి వీరి పొత్తు ఎన్నికలకే పరిమితమా లేక మునుముందు కలిసే వెళ్తారా అనేది ఆయా పార్టీ నాయకులే తేల్చాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: