ఏపీలో ఘోర‌మైన ఓట‌మితో డీలా ప‌డ్డ చంద్ర‌బాబుకు బీజేపీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తోంది. ఆ పార్టీకి చెదిన ప‌లువురు కీల‌క నేత‌లు బీజేపీలోకి జంప్ చేసేస్తున్నారు. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులే పార్టీ మారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక చిన్న చిత‌కా నాయ‌కులు, జిల్లా పార్టీ అధ్య‌క్షులు ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక తెలంగాణ‌లో తెలుగుదేశం పూర్తిగా చ‌చ్చిపోయింది. 


ఇక్క‌డ టీడీపీ భూస్థాపితం అవ్వ‌డం, కాంగ్రెస్ చేతులెత్తేసే ప‌రిస్థితి రావ‌డం.. ఇలాంటి ప‌రిస్థితి ఆస‌రాగా చేసుకుని తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కమల నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన నేతలకు బీజేపీ నేతలు వల వేస్తున్నారు. ఇక ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా టీడీపీలో కీల‌క నేత‌గా ఉండ‌డంతో పాటు ప్ర‌స్తుతం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న కోనేరు చిన్ని బీజేపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది.


కోనేరు చిన్ని తండ్రి కోనేరు నాగేశ్వ‌ర‌రావు గ‌తంలో కొత్త‌గూడెం నుంచి ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కొత్త‌గూడెం సీటు ఆశించినా పొత్తులో భాగంగా బాబు ఆ సీటును కాంగ్రెస్ నేత వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుకు వ‌దిలేశారు. ఆయ‌న గెలుపుకోసం చిన్ని తీవ్రంగా కృషి చేశారు. ఆయ‌న‌తో పాటు అదే జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ - కాంగ్రెస్ కూట‌మి క్లీన్‌స్వీప్ చేసింది. అశ్వారావుపేట సీటు కూడా టీడీపీ ఖాతాలో ప‌డింది.


ఆ త‌ర్వాత మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు చిన్నిని టీఆర్ఎస్‌లో చేర్పించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక కోనేరు చిన్ని గురువుగా భావించే నామా నాగేశ్వ‌ర‌రావు సైతం ఇటీవ‌ల పార్టీ మారిపోయారు. ఈ క్ర‌మంలోనే చిన్ని బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన అమిత్ షాను సైతం ఆయ‌న క‌లిశారు. త‌న రాజ‌కీయ గురువు నామా నాగేశ్వర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేర‌డం... రాజ‌కీయంగా టీడీపీలో ఉంటే వెన‌క‌ప‌డిపోయే ఛాన్సులు ఉండ‌డంతో ఇప్పుడు చిన్ని బీజేపీలో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. 


ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులతో కోనేరు చిన్ని మంతనాలు జరుపుతున్నట్టుగా టాక్‌. తనతో పాటు వీరిందరిని బీజేపీలో చేరేందుకు కోనేరు చిన్ని చర్చలు జరుపుతున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: