చరిత్రలోనే తొలిసారి అతి తక్కువ విలువకు చైనా కరెన్సీ చేరింది. చైనా తీసుకున్న తాజా ఈ చర్యతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా ట్రెజరీ విభాగం మంగళవారం చైనాను ‘కరెన్సీ మానిప్యూలేటర్‌’(కరెన్సీ విలువను అవసరానికి తగినట్లు మార్చే) దేశంగా ముద్రవేసింది. ఈ దెబ్బకు వాణిజ్య యుద్ధం తీవ్రమై అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కుంగుతుందో అని అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులు మరింతగా వడ్డీ రేట్లు తగ్గించేలా అమెరికా ఫెడ్‌పై ఒత్తిడి పెంచవచ్చనే ఊహాగానాలు నెలకొన్నాయి. గత వారమే ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. 


మరోపక్క చైనా కరెన్సీ యువాన్‌ 1.9శాతం విలువ కోల్పోయింది. హంకాంగ్‌లో డాలర్‌ విలువ 7.1087 యువాన్లకు చేరింది. ఆగస్టు 2015 తర్వాత ఒక్క రోజులో ఇంత విలువ కోల్పోవడం ఇదే తొలిసారి. బీజింగ్‌ ఒక్కసారిగా యువాన్‌ విలువను తగ్గించినట్లు వార్తలు వెలువడటంతో కరెన్సీ మార్కెట్లు బేజారెత్తాయి. చైనాలో కూడా యువాన్‌ ఇదే విధంగా విలువ కోల్పోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి చైనా కరెన్సీ గారడీపై మండిపడ్డారు. ఇది కరెన్సీ గారడీ. ఫెడ్‌ ఇది వింటున్నావా. ఇది అతిపెద్ద ఉల్లంఘన.. భవిష్యత్తులో చైనాను ఇదే బలహీన పరుస్తుంది. బిలియన్లకొద్దీ డాలర్ల అమెరికా సొమ్మును చైనా తీసుకుంటోంది. అమెరికా వ్యాపార అవకాశాలను, కర్మాగారాలను గుంజుకోవడానికి చైనా తరచూ కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా మార్చేస్తోంది. మా ఉద్యోగ అవకాశాలను, కార్మికుల వేతనాలను దెబ్బతీస్తోంది. మా వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు హాని చేస్తోంది. ఇక ఇది కుదరదు.’ అని సోమవారం ట్రంప్‌ ట్వీట్‌చేశారు. 
.
1994 తర్వాత చైనాపై కరెన్సీ మానిప్యూలేటర్‌ అనే ముద్ర పడటం ఇదే తొలిసారి. అమెరికాలో సెమీ యాన్యూవల్‌ కరెన్సీ నివేదిక వచ్చిన తర్వాత చైనాపై ఈ ముద్ర వేసేందుకు అగ్రరాజ్యానికి అవకాశం దక్కింది. గతంలో 1992 నుంచి 1994 వరకు కూడా చైనాపై ఈముద్ర ఉంది. 1988లో దక్షిణ కొరియా, తైవాన్లను కూడా ఇదే విధంగా అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం చైనాపై ఈ ముద్ర వేయడానికి అమెరికా మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకొంది. కరెన్సీ మార్కెట్లో చురుగ్గా ప్రభుత్వ జోక్యం, అమెరికాతో భారీ వాణిజ్య మిగులు ఉండటం, భారీగా కరెంటు ఖాతా మిగులు సాధించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొంది. 

యువాన్‌ విలువ తగ్గడానికి చైనా వివరణ ఇచ్చింది. ‘‘ చైనాకు వ్యతిరేకంగా ఏకపక్ష ధోరణి, వ్యాపార రక్షణాత్మక విధానాలు, సరికొత్త టారీఫ్‌లు విధించే అవకాశం ఉండటటంతో ఈ తరుగుదల చోటుచేసుకొంది. అంతేకానీ విలువను తగ్గించడంలో పోటీపడం.’’ అని చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఈ గాంగ్‌ తెలిపారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని  తమ దేశ కంపెనీలకు చైనా సూచించింది. ఆగస్టు 3 తర్వాత  కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తులపై టారీఫ్‌లు విధించే అంశాన్ని కొట్టపారేయలేమని పేర్కొంది. 

అమెరికా అధికారులు ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తలుపు తట్టనున్నారు. కరెన్సీ మార్పుల నుంచి చైనా లబ్ధిపొందే చర్యలను అడ్డుకోవాలని కోరే అవకాశం ఉంది.  వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారడంతో డోజోన్స్‌ 767 పాయింట్లు నష్టపోయి 2.9శాతం కుంగగా.. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 3 శాతం వరకు విలువ కోల్పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: