బిగ్ బాస్ లో హేమ ఎలిమినేట్ అయ్యి చాలా రోజులైంది. హేమ ఎలిమినేట్ అయ్యిన తర్వాత తన ఎలిమినేషన్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ గోల చేసింది. ఎడిటింగ్ ద్వారా తన తప్పులు ఎక్కువగా చూపారని బిగ్ బాస్ టీమ్ పై ఆరోపణలు చేసింది. అవి కాస్తా సంచలనం అయ్యాయి.


ఆమె తర్వాత జాఫర్ కూడా ఎలిమినేట్ అయ్యాడు.. అయితే ఇప్పుడు హేమ ఎలిమినేషన్ గురించి తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన భావాలు పంచుకున్నారు. బిగ్ బాస్ నుంచి మొట్టమొదట హేమ ఎలిమినేట్ కావడం బాధనిపించిందన్నారు. అయితే ఇది తమకు తెలిసిన అమ్మాయి ఎలిమినేట్ అయ్యిందని కాదు.. కానీ కేవలం మూడు రోజుల్లోనే ఎలిమినేట్ కావడం బాధనిపించిందన్నారు.


అయితే.. బిగ్ బాస్ సంస్థ రూల్స్ వాళ్లవి వాళ్లకుంటాయి.. అంటూనే కేవలం 3 రోజుల్లోనే ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నటి హేమ గురించి కొన్ని మాటలు చెప్పారు. రక్త కన్నీరు సినిమా సమయంలో ఆమెను చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కొన్నాళ్లుగా హేమ చాలా బాగా కామెడీ చేస్తుందని... అతడు సినిమాలో ఆమె లేడీ బ్రహ్మానందంగా కనిపించిందని మెచ్చుకున్నారు.


కొంతకాలం క్రితం హేమ కనిపించని సినిమా ఉందా.. అన్నట్టుగా అయ్యిందని పరుచూరి గోపాలకృష్ణ మెచ్చుకున్నారు. ఆ మధ్య సినీరంగంలో సమస్యలపై కూడా ధైర్యంగా మాట్లాడిందన్నారు. 2013లో తానాకు మాతో పాటు వచ్చిందని .. అక్కడ తెలుగు భాష మీద ఓ నాటిక వేస్తే తను కోడలి వేషం వేసిందని గుర్తు చేసుకున్నారు.


తెలుగు తెరకు ఓ సూర్యకాంతం, ఛాయాదేవిలా హేమ కూడా చక్కగా కదురుకుందని పరుచూరి గుర్తు చేసుకున్నారు. తన ఎలిమినేషన్ బాధించిందన్న పరుచూరి.. బిగ్ బాస్ షోలో మొదటి శని, ఆదివారాలు ఎలిమినేషన్ లేకుండా చేస్తే బావుంటుందన్నారు. హేమ బిగ్ బాస్ లో బాగానే చేసిందని.. కేవలం ఆడియన్స్ వేసిన ఓటు తప్ప.. తను ఎందుకు వచ్చేసిందో అర్థం కాలేదని పరుచూరి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: