సుష్మాస్వ‌రాజ్ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న బీజేపీ నేత‌. అక‌స్మాత్తుగా ఆమె క‌న్నుమూయ‌డం ఎంద‌రినో క‌ల‌చివేసింది. మంగ‌ళ‌వారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సుష్మను కుటుంబసభ్యులు రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గుండెపోటుతో సుష్మ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.  


ఎంద‌రో మ‌న్న‌న‌లు పొందిన సుష్మ‌కు పొలిటిక‌ల్ కెరీర్‌లో ఓ మ‌చ్చ‌గా మిగిలిపోయిన సంద‌ర్భం ల‌లిత్‌మోదీ ఉదంతం. ఐపీఎల్ కుంభకోణంలో నిందితుడు లలిత్ మోదీ తన భార్యకు పోర్చుగల్‌లో చికిత్స కోసం బ్రిటన్‌లో బస చేసేందుకు అనుమతి కోరాడు. దీనిపై ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా బ్రిటన్ కోరిన ఎన్వోసీని నాటి విదేశాంగ మంత్రిగా సుష్మ జారీ చేయడం వివాదాస్పదమైంది. అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడనివ్వరాదని బ్రిటన్ హైకమిషనర్‌కు ఆమె సూచించారు. అయితే లలిత్ మోదీకి ప్రయాణ వీసా జారీ చేసేందుకు ఆమె సహాయం చేశారని కొందరు విమర్శలు చేశారు. 


కాగా, సుష్మ‌స్వ‌రాజ్ కెరీర్ ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచింది. సుష్మాస్వరాజ్ 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. ఆమె తండ్రి హార్దేవ్‌శర్మ, తల్లి లక్ష్మి దేవి. సనాతన ధర్మ కాలేజీ నుంచి రాజకీయ శాస్త్రంలో సుష్మ డిగ్రీ చేశారు. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మ.. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. కేంద్రమంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మాస్వరాజ్ భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ శాఖ విధులను నిర్వర్తించిన రెండో మహిళా నేతగా సుష్మ రికార్డు సృష్టించారు. ఏడుసార్లు పార్లమెంటుకు, మూడుసార్లు అసెంట్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: