జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే కేంద్రం అనుకోని షాక్ ఇచ్చింది. ఓవైపు ప్రధాని మోడీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, రవాణాఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి వాళ్లను వరుసగా కలుస్తూ ఉన్నారు. హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. ఆయన ఏపీకి కావాల్సిన పనుల గురించి చర్చిస్తున్నారు.


నిధులు, ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే కేంద్రం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. అదేంటంటే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారంటూ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని కేంద్రం ప్రశ్నించింది.


అంతే కాదు.. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపైనా వివరణ కోరినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్మాణం నేపథ్యంలో పరిధికి మించి పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించినట్టు కేంద్రపర్యావరణ శాఖ చెన్నై కార్యాలయం రూపొందించిన నివేదికలో చెప్పిందట. జులై 22న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ లో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ విషయం గురించి ప్రస్తావించినట్టు సమాచారం.


అంతేకాదు.. ఇప్పటికే ఏపీకి నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు అఫిడవిట్‌లో తెలిపారు.ఇది నిజంగా జగన్ కు చేదువార్తగానే చెప్పాలి.. ఎందుకంటే..ఇప్పటికే జగన్ పోలవరం పనులను ఆపేయించారని ఓ వైపు తెలుగుదేశం ప్రచారం జోరుగా సాగిస్తోంది. పోలవరం టెండర్ల రద్దు చేసి రీ టెండర్లు పిలుస్తామని ఇప్పటికే జగన్ చెప్పారు. ఆ ప్రాసెస్ కారణంగా పోలవరం ఆలస్యం కావడం ఖాయం. దీనికితోడు ఇప్పుడు పర్యావరణ అనుమతులు కూడా రద్దయ్యే పరిస్థితి వస్తే.. జగన్ సర్కారుపై ప్రజల్లో నెగిటివ్ ఒపీనియన్ వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.


చంద్రబాబు తన పాలనలో మొదటి రెండేళ్లు పోలవరం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తరవాత కాలంలో టెండర్లలో గోల్ మాల్ సంగతి ఎలా ఉన్నా.. పనులు చకచకా జరుగుతున్నాయన్న ఫీలింగ్ ప్రజలకు కలిగించారు. ప్రతి సోమవారం పోలవారం అంటూ హడావిడి చేశారు. ప్రతి వారం గంటల తరబడి వీడయో కాన్ఫరెన్సులో సమీక్షలు చేశారు. దాంతో పోలవరం పూర్తయిన ఫీలింగ్ కలిగించారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రాగానే.. ఇలా బ్రేకులు పడితే.. దీన్ని కూడా టీడీపీ రాజకీయం చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: