( నేడు అంతర్జాతీయ ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా అడవుల్లో బతుకుతూ పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రకృతి పరిరక్షకులుగా మారిన అడవి బిడ్డల కథ ఇది. )

కొండా కోనల్లో అడవుల మధ్య బతుకుతూ రెక్కాడితేకానీ డొక్కాడని అతిసాధారణ మానవులు వీరు. అడవుల్లో బతుకుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న ప్రకృతి పరిరక్షకులు ఈ గిరిజనులు. కొండ నేలకు కొత్త సారాన్ని పెంచుతూ, పండ్లతోటలు సాగు చేసుకొంటూ, అడవులను ధ్వంసం చేయకుండా వీరి అవసరాలు తీరే సరికొత్త జీవనశైలికి నాంది పలికారు. వీరి శ్రమను గుర్తించిన నాబార్డు వీరికి ఆర్ధిక ఆసరా ఇవ్వడంతో, వీరొక అద్భుతం సృష్టించారు. వాళ్లు సాధించింది మామూలు విజయం కాదు. ఏకంగా బంజరు భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. గడ్డిపోచలు కూడా మొలకెత్తని నేలలో అద్భుతమైన పండ్లతోటలను పెంచుతున్నారు...


ఇసుక తేలి,సారవంతమైన పైపొరలు కొట్టుకు పోయి,ముళ్లచెట్లపొదలతో నిండిన బీడుభూములను సాగులోకి తీసుకురావడం సామాన్యం కాదు. కానీ ఆదివాసీల పట్టుదల,తపన అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఏదైనా సాధించగలంమన్న నమ్మకం కలిగింది. చెరువుల్లో పూడిక తీసి ఒండ్రుమట్టిని చేలకు తరలిస్తున్నారు. బంజరుభూములు సారవంతంగా, పచ్చగా మారుతున్నాయి. కూలీలుగా మిగిలిపోయిన ఆదివాసీలను రైతులుగా మార్చిన నిజమైన అనుభవం యిది. ఈ నేపథ్యంలో అదిలాబాద్‌,ఖమ్మం,చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం, జిల్లాల్లోని ఆదివాసీలు మాతోట కార్యక్రమాల వల్ల తమకాళ్లమీద తాము నిలబడగలిగి,తమఅభివృద్ధిని తామే సాధించుకునే క్రమంలో వారి విజయాలనూ వారి, కొత్తవెలుగును చూద్దాం రండి.


మాతోట అంటే..?

మన దేశంలో గిరిజనులు ఎక్కువగా మాట్లాడే గోండు భాషలో వాడి అంటే తోట. గుజరాత్‌ గిరిజన ప్రాంతాల్లో గిరిజన రైతులచే తొలిసారిగా ఉసిరి మామిడి తోటలను పండించి గిరిజనుల బతుకులను మార్చే చిరుప్రయత్నమే నాబార్డు 'వాడి' కార్యక్రమం. వాడిని తెలుగులో 'తోట' అంటాం కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం 'మాతోట'గా మారింది. తొలిచిగురు శ్రీకాకుళం కొండల్లో.... ' మాతోట' తొలిసారి చిగురించింది 2006లో శ్రీకాకుళం గిరిజన పల్లెల్లోనే. పాతపట్నం, మిల్యపుట్టి, హిరమండలం, సరవకోట మండలాల్లో ఇరవై అయిదు పంచాయితీల్లోని 49 గ్రామాలలో గిరిజనరైతులు పండ్లతోటలు పెంచుతున్నారు. ఈ ప్రాంతంలో మామిడితోటలకు నీటిని కుండలతో సరఫరాచేస్తున్నారు. పద్దెమిది గ్రామాల్లో 27వేల కుండలను రైతులకుపంచారు. కొండవాలు ప్రాంతంలో సాగు చేస్తున్న 132ఎకరాల పండ్లతోటల కోసం గ్రావిటీ పైప్‌లైన్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదివాసీలు ఏమంటారు.. ఆదిలాబాద్‌జిల్లా,నిర్మల్‌కు అరవై కిలోమీటర్ల దూరంలో కవ్వాల్‌ అభయారణ్యంలో, తన కుటుంబంతో మూడెకరాల్లో మాతోట వేసిన గిరిజన మహిళ చైనేని రాజవ్వ ఏమంటారంటే... ''మా కుటుంబానికి మూడెకరాలున్నది.రెండకరాల్లో వరిపంటలు పండిస్తున్నాం. ఒక ఎకరంలో రెండేళ్ల క్రితం ఉసిరి, మామిడి మొక్కలు వేశాం. నాబార్డు సాయంతో కొలతలు తీసి గుంతలు తవ్వి మొక్కలు వేశాం. నాబార్డువారు బాయిని తవ్వించారు.ఆ నీటితో తోటలు పెంచుతున్నాం. అంతర పంటగా నువ్వులు వేశాం. రెండేళ్లుగా మామిడి పండ్లు అమ్ముకొని జీవిస్తున్నాం, ఇపుడు మేం కూలీ పనుల కోసం వెతుక్కోనక్కర లేదు.'' అన్నది.


మా పొలంలోనే మాకు పనులు!!

చిత్తూరు జిల్లా, కేవీబీపురం మండలంలో గిరిజనులకు అడవులే ఆధారం. కలప,మారేడుకాయలు, గమ్ము ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించి బతికేవారు. ఒక్కోసారి అడవుల్లోకి వెళితే వారం రోజులు వరకు బయట ప్రపంచం చూసేవారు కాదు. ఇదంతా ఒకప్పటి పరిస్ధితి. 2009లో ఇక్కడ మాతోట కార్యక్రమం మొదలయ్యాక మార్పువచ్చింది, నేడు సొంత భూముల్లో పండ్లతోటలు, కూరగాయలు పెంచుకుంటూ తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. ఈ జిల్లాలో అయిదు వందల కుటుంబాలు పండ్లతోటల సాగులో నిమగ్నమయ్యాయి.మాతోటతో ఆదివాసుల భవిష్యత్‌కి ఓ దారి కూడా చూపడమే కాక సంస్కతిని కాపాడడానికీ ఇక్కడి మాస్‌సంస్ధ కృషిచేస్తుంది.


'' పండ్ల తోటలతో పాటు, అంతర పంటలుగా వంగ, మిరప, అల సంద, సొర, కాకర, బీర పండిస్తున్నాం. మొక్కలను చీడపురుగుల నుండి కాపాడడానికి వేపనూనె, ఆకులతో తయారు చేసిన ద్రావకాన్ని మొక్కలపై పిచికారీ చేయడం వల్ల చెట్లు చక్కగా ఎదుగుతున్నాయి. ఉపాధి హామీ పనులకు పోవాల్సి వచ్చేది. ఇపుడు ఇంటిల్లిపాదీ మా పొలంలోనే పనులు దొరుకుతున్నాయి'' అన్నారు,కొండల ఆదవరం గ్రామస్తురాలు బుజ్జమ్మ.


మద్యం మాని సేద్యం చేస్తున్నాం...!!

ఖమ్మం జిల్లాలో స్ధానిక ఎన్జీఓలు నాబార్డు అండతో గిరిజనరైతులకు పండ్లతోటల పెంపకం పై ఆవగాహన కలిగిస్తున్నారు. మాతోటల నిర్వహణ వల్ల గిరిజనులజీవన శైలిలో మార్పు కలుగుతోంది. ఆకుపచ్చని అరకు లోయలో... విశాఖ జిల్లాలో డుంబ్రిగుడ, అరకువ్యాలీ, పెదబయలు, చింతపల్లి, మంచింగిపుట్‌, అనంతగిరి, వి.మాడుగుల, కొయ్యూరు మండలాల్లో 2,792 ఎకరాల్లో మాతోట పూర్తయింది. మరో 4,208 ఎకరాల్లో మొక్కలు పెరుగుతున్నాయి. లోయ ప్రాంతంలో వీరు సాగు చేస్తున్న పొలాలకు వెళ్లాలంటే ఏరులు దాటి ఎగుడు దిగుడు కొండలు ఎక్కిదిగాల్సిందే.

'' అరకు లోయలో తోటల చుట్టూ ,కిత్తనార మొక్కలను పెంచుతున్నారు. వీటి ఆకులకు ముళ్లు ఉండటం వల్ల పశువులు, పాములు కూడా తోటలోకి రాకుండా కాపాడతాయి. ఈ మొక్కల ఆకుల నుండి వచ్చే నారకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. దీనిని పడవల తయారీలో వాడుతున్నారు. ఎకరా తోటకు కంచెగా వేసిన కిత్తనార ఆకులను కోసి అమ్మితే అయిదు వేల వరకు ఆదాయం వస్తుంది.'' అంటారు ఆ గిరిజనులు!!

నాబార్డు ఇచ్చిన చేయూతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో, దాదాపు 60వేల కుటుంబాలు సుస్ధిర జీవనోపాధులు పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: