రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకు వెళ్తారు.. దీనికి అంతా చెప్పే సమాధానం ప్రజాసేవ.. మరి ఆ ప్రజాసేవ చేయాలంటే..ఏదో ఒక పదవి ఉండాలి.. అందుకే గ్రామ సర్పంచ్ పదవి నుంచి.. అటు ప్రధానమంత్రి పోస్టు వరకూ ప్రతిదానికీ పోటీ ఉంటుంది. చిన్నాచితకా పదవుల సంగతేమో కానీ.. మంత్రి పదవులంటే మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది.


మరి అలాంటి మంత్రి పదవి ఇస్తాను రమ్మంటే ఎవరైనా వద్దంటారా.. అందులోనూ ఆఫర్ ఇచ్చింది సాక్షాత్తూ ముఖ్యమంత్రి.. అప్పట్లో ఆయనో ట్రెండ్ సెట్టర్.. అయినా సరే.. ఆ ఇద్దరు మాత్రం చాలా ఆలోచించుకుని.. సింపుల్ గా సారీ చెప్పేశారట.. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటారా.. వారే.. దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.


ఈ విషయాన్ని ఆయన ఓ పత్రికకు రాసిన వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఈ సీన్ కు బ్యాక్ డ్రాప్ ఏంటో తెలుసుకుందాం.. 1982లో అప్పటివరకూ వెండి తెర వేలుపు వంటి నందమూరి తారక రామారావు.. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.. ఆ పార్టీ అతి తక్కువ సమయంలో అంటే కేవలం 9 నెలల కాలంలో ఏకంగా అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంది.


1983లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఎందరో యువ నాయకులను ప్రోత్సహించారు. రాజకీయాల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది. అయితే ఆ వెంటనే అనుకోకుండా ఆయన మంత్రి వర్గంలోని నెంబర్ టూ నాదెండ్ల భాస్కర్ రావు.. కేంద్రంలోని ఇందిరా గాంధీ సాయంతో ఎన్టీఆర్ అమెరికాలో వైద్యం కోసం వెళ్తే.. ఇక్కడ దొంగదారిన సీఎం అయ్యారు. ఈ 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తెలుగుదేశం నేతలతో పాటు అప్పట్లో జనతా పార్టీలో ఉన్న ముప్పవరకు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారట.


ఆ తర్వాత వెంకయ్యనాయుడు, జైపాల్‌ రెడ్డి నిర్వర్తించిన పాత్రను, చేసిన కృషిని గమనించిన ఎన్టీఆర్ వారికి తన మంత్రి వర్గంలో చేరమని ఆఫర్ ఇచ్చారట. మంత్రిపదవుల ద్వారా .. సలహాలతో మరింతగా ప్రజలకు సేవ చేయవచ్చు అని ఆహ్వానించారట. దీంతో వెంకయ్య, జైపాల్ ఆ విషయంపై మేమిరువురం కూలంకషంగా చర్చించుకున్నారట. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారట.. దానిపై స్పందించిన ఎన్టీఆర్‌.. అవసరమైతే.. మీ పార్టీలో ఉంటూనే మంత్రులుగా కొనసాగండి అని కూడా ఆఫర్ ఇచ్చారట.


దానిపైనా చర్చించుకున్న ఈ రాజకీయ దిగ్గజాలు.. ఆలోచనలపరంగా రామారావు చాలా మొండివారు. అలాగే సిద్ధాంతాల విషయంలో తమది రాజీపడే వ్యక్తిత్వం కాదు. అందుకే పదవులు ఆశించకుండా... బయటనుంచి సహకరించాలని నిర్ణయించుకున్నారట. ఎన్టీఆర్ మంత్రివర్గంలోకి రమ్మని ఎంతగా ఒత్తిడి చేసినా... ప్రేమపూర్వకంగానే తిరస్కరించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: