ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఆ పార్టీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ తాను ఎక్క‌డా విప‌క్షాల‌కు, మీడియాకు చిన్న ఛాన్స్ ఇవ్వ‌కుండా పాల‌న చేస్తుంటే ఆ పార్టీ నేత‌లు మాత్రం బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి సీనియ‌ర్ నేత అన్నా క్యాంటిన్ల‌పై మాట్లాడిన మాటలు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ఇక తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కియా కారు ప్రారంభోత్స‌వానికి వెళ్లి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు, మీడియాకు పెద్ద అస్త్రంగా మారిపోయాయి.


నిజానికి మాధ‌వ్‌కు అసంతృప్తి ఉంటే అది వేరేగా చూపించాల్సి ఉండాల్సిందే కాని నేరుగా పారిశ్రామిక‌వేత్త‌కు రాంగ్ మెసేజ్ వెళ్లేలా మాధ‌వ్ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని సొంత పార్టీ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు. ఇక ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఓ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ ఎన్ రాజు గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.  


ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి మంతెన రాంబాబు చేతిలో ఓడిన న‌ర‌సింహారాజు ఉండి వైసీపీ ఇంచార్జ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత జ‌గ‌న్ పిలిచి పోటీ చేయాల‌ని కోరితేనే తాను పోటీ చేశాన‌ని.. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు తాను ఓడిపోయాన‌ని... ఎన్నికల్లో తాను ఓడిపోయినా తాను నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కోసం ప‌ని చేస్తున్నాన‌న్నారు.


అలాగే గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత జ‌గ‌న్ త‌న‌కు రూ.15 కోట్లు పంపార‌ని... అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా జ‌గ‌న్ డ‌బ్బు పంపినా తాను మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ని న‌ర‌సింహారాజు చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విచ్చ‌ల‌విడిగా డ‌బ్బులు పంచి గెలిచార‌ని అంటున్నారు.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు తాజాగా రాజు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఊత‌మిచ్చేలా ఉన్నాయి. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై పార్టీ అధినేత జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: