ఆంధ్ర ప్రదేశ్ లో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని.. సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. ఆమేరకు ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ఫరావలేదని అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారు. జనవరి ఒకటి నుంచి అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ పథకంపై ప్రజలు కూడా బాగానే ఆశలు పెట్టుకున్నారు.


ఇప్పుడు జగన్ ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు.. పాఠశాలల్లో ఖాళీల భర్తీకి క్యాలెండర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగానే ఉపాధ్యాయల సంఖ్య ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చే విషయంలో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.


తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ప్రాథమికోన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని సీఎం ఆదేశించారు. ఆహ్లాదకరంగా ఉండేలా పెయింటింగులతో పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.


ఇక్కడ ఓ కీలకమైన విషయం ఏంటంటే.. రాష్ట్రంలోని 42 వేల 655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు ఇప్పటికే అధికారులు తీయించి పెట్టారు. వీటిని అభివద్ధి చేసిన తర్వాత మరోసారి ఫోటలు, వీడియోలు తీస్తారన్నమాట. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాని ప్రజలకు చూపించాలన్నది జగన్ సంకల్పం. అభివృద్ధి చేసిన తర్వాత ఫోటోలు చూస్తే జనం దిమ్మతిరగాలన్నది ఆయన పట్టుదల.


ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకోవాలని ఉంది.. అని జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజలకు చెప్పుకున్నాడు. అలా జనం ఫీలవ్వాలంటే.. ముందుగా ప్రక్షాళన జరగాల్సిన వాటిలో పాఠశాలు కూడా ఒకటని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: