ఆంధ్రప్రదేశ్ లోని  25 ఎంపీ స్థానాలకు గాను, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  22 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడితే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా  పార్టీ ఎంపీల పనితీరు లేదని వైకాపా అధినేత,   ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. లోక్ సభ సమావేశాల్లో పార్టీ  ఎంపీల పనితీరు ఎలా ఉందనే విషయంపై ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి  ఆరా తీసినట్లు సమాచారం .


 అయితే చాలా మంది ఎంపీలు లోక్ సభ  కార్యకలాపాలలో  సక్రమంగా పాల్గొనకపోవడమే కాకుండా ,  రాష్ట్రానికి నిధులు సాధించడంలోను  విఫలం అవుతున్నారన్న అభిప్రాయాన్ని ఆయన  వ్యక్తం చేస్తున్నట్లు  పార్టీ వర్గాలు  చెబుతున్నారు . రాష్ట్రానికి నిధులు సాధించడం పట్ల శ్రద్ధ చూపించకుండా , వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టు కునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న జగన్ తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్నారని అంటున్నారు .   మరి కొంత మంది ఎంపీలు స్థానిక ఎమ్మెల్యేలతో కీచులాడడానికి ఇస్తున్న ప్రాధాన్యత,  ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదన్న  భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు . స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించి పార్టీ ప్రతిష్టను పెంచాలంటూ ఎంపీలకు జగన్ ఖరాఖండిగా తేల్చిచెప్పారని  పేర్కొంటున్నారు . 


రాష్ట్రం లో  25 ఎంపీ స్థానాలకు గాను 22 మందిని ప్రజలు గెలిపించినప్పటికీ  రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు సాధించడంలో ఎంపీలు పెద్దగా చొరవ చూపడం  లేదన్న అభిప్రాయం తో ఉన్న  జగన్ మోహన్ రెడ్డి, ఇకనైనా ఎంపీలు సమన్వయంతో,   ఏకతాటిపైకి వచ్చి  రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జగన్  దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: