తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడితే ఆ ఎఫెక్ట్ కృష్ణా,గోదారిల పై ఉంటుంది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చిపడుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా  నాగార్జునసాగర్‌ జలాశయంకు చెందిన మరికొన్ని గేట్లను ఎత్తారు. 

వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున శ్రీశైలంలో 10 గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  మొత్తం 8.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అన్ని గేట్లను పైకెత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద రావడంతో జూరాల నిండుకుండలా మారింది.   దీంతో జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.  జలాశయ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 5.85 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగానూ ప్రస్తుతం 316.44 మీటర్లు నమోదైంది. ప్రస్తుతం సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.  సాగర్‌ నుంచి వరద జోరు కొనసాగితే ఇవాళ లేదా రేపటికి పులిచింతల నిండే అవకాశముంది. అనంతరం కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీ మీదుగా..బంగాళాఖాతంలో కలుస్తుంది.  ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి 65,207 క్యూసెక్కులకు నీటిని దిగువకు వదులుతున్నారు.

మరోవైపు సాగర్‌ జల కళ సంతరించుకోవడం, గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండడంతో ఈ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్‌ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: