ఆంధ్రప్రదేశ్ర రాష్ట్రంలో సర్కార్ వైన్ షాపుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. మద్యం షాపుల ఏర్పాటులో భాగంగా ఎక్సైజ్‌ శాఖ తొలివిడతలో 777 దుకాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ షాపులకు అవసరమైన ఇళ్లు, రవాణా వాహనాల కోసం ఈనెల 15లోగా అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని జిల్లాల అధికారులకు ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత వారం పది రోజుల్లోనే షాపుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా మొత్తం దుకాణాలను ఏపీఎ్‌సబీసీఎల్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో అక్టోబరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతోపాటు సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. పట్టణాల్లోని షాపులకు నలుగురు, గ్రామీణ ప్రాంతాల్లో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించనున్నారు. షాపులకు అనువైన ఇళ్లు దొరికితే వెంటనే ప్రారంభించాలని భావిస్తున్నారు.


ప్రస్తుత పాలసీని మూడు నెలలు పొడిగించగా 777 షాపులకు లైసెన్సులు రెన్యువల్‌ కాలేదు. కాబట్టి తొలివిడతగా వాటిని ప్రభుత్వ షాపులుగా మార్చాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. దీంతో వాటి ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కనీసం నెల రోజులకు పైగా ఈ షాపులను ముందుగా నిర్వహించగలిగితే లోటుపాట్లను గుర్తించి, అక్టోబరు నుంచి ప్రారంభించే మొత్తం షాపులకు లోపాలు లేకుండా వ్యాపారం నిర్వహించవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 2022 వరకూ కొనసాగనున్నాయి. మద్యం షాపులను దశలవారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించగా, బార్ల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బార్లకు 2018లో ఐదేళ్ల కాలానికి ఒకేసారి లైసెన్సులు జారీచేశారు. దీంతో వాటిని తగ్గించడం కష్టమనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.
 

కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే షాపుల్లో మద్యం నిల్వలకు ఎలాంటి పరిమితి విధించకూడదని నిర్ణయించారు. గతంలో ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేసినప్పుడు ఒక్కో షాపునకు గరిష్టంగా రూ.2లక్షల విలువైన మద్యం నిల్వలనే అనుమతించారు. కానీ ఇకపై మొత్తం ప్రభుత్వ షాపులే కావడంతో ప్రైవేటు షాపుల తరహాలోనే వ్యాపారం చేయాలని ఏపీఎ్‌సబీసీఎల్‌ భావిస్తోంది. గతంలో ప్రభుత్వ షాపుల్లో సరుకు అయిపోతే ప్రైవేటు షాపులకు వెళ్లి కొనుక్కున్నారని, కానీ ఇప్పుడు ప్రభుత్వ షాపుల్లో అయిపోతే మద్యం దొరక్క గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి పరిమితి లేకుండా మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని ఎక్సైజ్‌ వర్గాలు తెలిపాయి.
 




మరింత సమాచారం తెలుసుకోండి: