మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేవని..ఉత్తరాదిన కుంభ వృష్టి కురుస్తుందని..ఇది పాలకులకు భవిష్యత్ లో పెద్ద దెబ్బ అని తెగ విమర్శలు వచ్చాయి.  కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి.  వర్షాల రాకతో రైతులు ఆనందోత్సాహాల మద్య ఉన్నారు.  ఒక దశలో ఈ యేడాది కరువు తాండవిస్తుందని భావించిన రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.  సామాన్యలకు కూడా వర్షాల రాకతో కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలంటే అధిక ధరలతో సతమతమవుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇబ్బందులు తొలగుతాయన్న ఆశలో ఉన్నారు. 

కృష్ణా, గోదావరి పొంగి పొర్లుతున్నాయి.  ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు.  కిందకు వస్తున్నా నీరు ఉధృతం కావడంతో నాగార్జున సాగర్ అన్ని 24 గేట్లు ఎత్తివేశారు.  తాజాగా పులిచింతల నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను అధికారులుకొద్దిసేపటి క్రితం ఎత్తి, దిగువకు నీటిని వదిలారు. బ్యారేజ్ 7 గేట్లను ఎత్తిన అధికారులు, మరోవైపు కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని పంపుతున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది.

తొలుత  నీటి మట్టం 12 అడుగులకు చేరితే గేట్లు తెరవాలని అధికారులు భావించినప్పటికీ వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో కృష్ణలంక తదితర నదీతీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. లంక గ్రామాల్లో ప్రత్యేక సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతే కాదు. నదిలో నీటి ప్రవాహం పెరగడంతో వివిధ ఘాట్ల వద్ద యాత్రికుల పుణ్యస్నానాలపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: