ఆగస్ట్ 15.. స్వాతంత్ర్య దినోత్సవం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఎగరేస్తారు. అయితే ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడ జెండా ఎగరేయబోతున్నారు.. ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే.. గతంలో సీఎం చంద్రబాబు.. ఒక్కో స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఒక్కో చోట జెండా ఎగరేశారు.


ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్న తలంపుతో ఇలా చేస్తున్నారు. అదే తెలంగాణలో అయితే ఈ సమస్య లేదు. అక్కడ ఎప్పుడైనా హైదరాబాద్ లోనే జెండా ఎగరేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడూ రాజధానిలోనే జెండా ఎగరేసేవారు. కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో జెండా ఎగరేసే సంప్రదాయం మారింది.


రాజధాని ప్రాంతంలో కాకుండా గతంలో కర్నూలులోనూ చంద్రబాబు జెండా ఎగరేశారు. అయితే జగన్ సీఎం అయ్యాక మొదటి సారి విశాఖ పట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో జండా ఎగరేస్తారని టాక్ వచ్చింది. కానీ.. ఈసారి వైఎస్ జగన్ సీఎం హోదాలో తొలిసారిగా కృష్ణా జిల్లాలో జరిగే వేడుకల్లోనే పాల్గొంటారట. ఈ మేరకు అధికార వర్గాలు షెడ్యూల్ ఖరారు చేశాయి.


కృష్ణా జిల్లాలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఆయా జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా కూడా ఖరారైంది. శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని జండా ఎగరేస్తారు.


ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, నెల్లూరులో హోం మంత్రి సుచరిత, కర్నూల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పంద్రాగస్టు వేడుకలలో జెండా ఎగరేసి జెండా వందనం సమర్పిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: