ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన వలంటీర్ల వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయంలో వ్యవస్థలో మార్పు తీసుకొనిరావటం కోసం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టామని  అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో విధులు నిర్వర్తించబోతున్న గ్రామ/వార్డ్ వలంటీర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. 
 
వలంటీర్ అంటే మూడు పదాల్లో లబ్ధిదారుల గుర్తింపు, డోర్ డెలివరీ, 50 ఇళ్ళకు తోడుగా ఉండటం అని సీఎం అన్నారు. ఈ మూడు పదాలలోనే వలంటీర్ల యొక్క భాద్యతలన్నీ కలిసిపోతాయని సీఎం అన్నారు. వలంటీర్ల వ్యవస్థలో అవినీతి అనేది ఉండకూడదని, వలంటీర్లు వారికి కేటాయించిన 50 ఇళ్ళకు సంబంధించిన భాద్యతలు నిర్వర్తించాలని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరికి 5 వేల రుపాయల గౌరవ వేతనం ఇస్తున్నామని సీఎం తెలిపారు. 
 
నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాలను కూడా 80% ఈ సంవత్సరమే అమలు చేస్తామని సీఎం అన్నారు. మిగిలిన 20% హామీలను మాత్రం వచ్చే సంవత్సరం నుండి అమలు చేయబోతున్నట్లు తెలిపారు. వలంటీర్ల ద్వారానే ప్రతి పని జరుగుతోందని, వలంటీర్లు ప్రభుత్వ స్వరం అని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చామని సీఎం చెప్పారు. 
 
వలంటీర్ల నుండి ముఖ్యమంత్రిగా ఆశించేవి రెండే రెండని ఒకటి లంచాలు తీసుకోకూడదు, రెండు వివక్ష చూపకూడదని సీఎం అన్నారు. వలంటీర్లపై ఫిర్యాదులేమైనా ఉంటే 1902 నెంబరుకు కాల్ చేయాలని, కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి కాల్ పై విచారణ జరుగుతుందని సీఎం అన్నారు. వలంటీర్లు తప్పు చేసారనే మాట రాకుండా చూస్తారని నమ్ముతున్నానని సీఎం అన్నారు. వలంటీర్లు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుండి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: