ఆటోమొబైల్ రంగంలో అంతర్జాతీయంగా మందగమన ధోరణులు నెలకొన్నాయని, ఇండియాలో కూడా పరిస్థితి ఇలాగే ఉందని సీ ఐ ఈ ఎల్ సీఈవో అదిత్య నారాయణ్ మిశ్రా ( హెచ్ ఆర్ సర్వీసెస్) అన్నారు. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు తగ్గటంతో కంపెనీలు ఉత్పత్తి కూడా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు ఉత్పత్తి తగ్గించటంతో ఉద్యోగాల్లో కూడా కోత విధిస్తున్నాయి. ఇప్పటికే 3.50 లక్షల ఉద్యోగాలకు కోత విధించారని సమాచారం. 
 
ఆటోమొబైల్ రంగంలో ఈ పరిస్థితి వలన కొన్ని చోట్ల ప్లాంట్లు మూసివేస్తున్నట్లుగా, ఎక్కువ వేతనాలు తీసుకునే వారి ఉద్యోగాలను తొలగించటంపై కంపెనీలు దృష్టి పెట్టినట్లుగా మిశ్రా తెలిపారు. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించటం వలన ఎక్కువగా తాత్కాలిక ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గటం వలన తయారీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని, సేల్స్ మరియు ఆర్ & డి ఉద్యోగాల్లో మాత్రం కోత పడే అవకాశం ఉందని టీమ్ లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ మునీరా లోలీవాలా అభిప్రాయం వ్యక్తం చేసారు. 
 
గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా జులై నెలలో చాలా తక్కువ స్థాయిలో వాహన విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. టాటా మోటర్స్, ఫోర్డ్. టొయోటా, మారుతీ సుజుకీ, హోండా కంపెనీలన్నీ ఉత్పత్తిని ఇప్పటికే తగ్గించుకున్నాయని తెలుస్తోంది. ఆటో మొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం ద్విచక్ర వాహనాల విక్రయం 10% తగ్గిందని సమాచారం. 
 
మూడున్నర కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న ఆటో మొబైల్ రంగంలో వాహనాలకు డిమాండ్ తగ్గిపోవటం వలన పది లక్షల ఉద్యోగాలలో కోత పడే అవకాశం ఉందని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య అంచనా వేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల అంశంపై కేంద్రం ప్రకటిస్తున్న నిర్ణయాల్లో స్పష్టత లేకపోవటం వలనే ఆటో మొబైల్ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆటో మొబైల్ పరికరాల తయారీ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: