ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త భూతం ఇది. మరో 9 నెలల్లో ఈ ఉపద్రవాన్ని ప్రపంచాన్ని ముంచెత్తుతుందని అంతా భయపడుతున్నారు. 2008-09 సంవత్సరాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యాలనే గడగడా వణికించింది. వరుసగా మూడేళ్ల పాటు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. మళ్లీ ఇప్పుడు ఆ మాంద్యం భూతం వచ్చే సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.


మరి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యం సంకేతాలు భారత్‌లోనూ కనిపిస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇండియాలో బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. వాహనరంగం సహా పలు రంగాల్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయి. స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇవన్నీ మన దేశం కూడా ఆర్థికమాంద్యానికి దగ్గరవుతోందనడానికి సంకేతాలే అంటున్నారు.


ఆర్థకి మాంద్యం వేడి.. ఇప్పటికే వినియోగదారులకు తగులుతోంది. జనం కొనుగోళ్లకు తొందరపడటం లేదు. ఖరీదైన వస్తువుల జోలికి వెళ్లటం లేదు. అమ్మకాలు క్షీణించడానికి ఇదే కారణం. దీనికితోడు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాలు చూస్తే మున్ముందు ఇంకా పతనావస్థ ఉందనే అభిప్రాయం కలగక మానదు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తుంది.


అసలు ఈ ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ఉత్పత్తి పడిపోతే మాంద్యం మొదలైనట్టే. దీనికితోడు ఉద్యోగాలు తగ్గిపోయి చమురు డిమాండ్ తగ్గిందంటే.. మాంద్యం వస్తున్న సంకేతాలు కనిపించినట్టే.. మాంద్యం వస్తే ఏమవుతుంది.. అంతర్జాతీయ వృద్ధిరేటు పడిపోతుంది. ఉద్యోగాల్లో కోత స్టార్ట్ అవుతుంది. ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు తగ్గిపోతాయి.


ఒక్కోసారి మాంద్యానికి ఒక్కో విషయం కారణమవుతుంది. 2008లో ఆర్థిక మాంద్యానికి అమెరికా సబ్ ప్రైమ్ ప్రధాన కారణం.. ఈసారి అమెరికా - చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ రెండు దేశాలూ ప్రస్తుతం ఇతర దేశాల వస్తువులపై టాక్సులు పెంచుతున్నాయి. ఇదే కొనసాగితే... మరికొన్ని నెలల్లో ఆర్థిక మాంద్యం రావడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: