ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముంపు బాధితులను ఆదుకునే పనిలో ప్రభుత్వం రంగంలోకి దిగింది.  అయితే వర్షాల తాకిడికి చంద్రబాబు నివాసం ప్రమాదంలో పడిందన్న విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు ఏపిలో డ్రోన్ల వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్లను వాడుతున్నారని..ఆయనను టార్గెట్ చేశారని టీడీపీ తమ్ముళ్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం పన్నుతున్న కుట్రలంటూ ఆందోళన చేస్తున్నారు.

ఆయన ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వపై వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మద్య పరస్పర దాడులు కూడా అయ్యాయి. కాగా,  డ్రోన్లను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ స్పందించారు.

వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తామే విజువల్స్ రికార్డ్ చేయించామని ఆయన అన్నారు. గత మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నామని అక్కడి చుట్టు పక్కల పరిస్థితులను అంచనా వేస్తున్నామని..ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకొనే డ్రోన్లను వాడుతున్నామని అన్నారు.  టెక్నాలజీ ఉపయోగించి ముంపు బాధితుల పరిస్థితులు అంచనా వేస్తున్నామే తప్ప ఇందులో ఎలాంటి కుట్రలు లేవని ఆయన స్పష్టం చేశారు.

అలాగే కరకట్ట ప్రాంతాల ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత అని ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు రచ్చ రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుపై దాడి చేసేందుకే రహస్యంగా ఇంటి భద్రత, సెక్యురిటీ ఉండే ప్రదేశాలు చిత్రీకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: