రివర్స్ టెండరింగ్.. జగన్ సీఎం అయ్యాక బాగా పాపులర్ అయిన పదం ఇది. అప్పటి వరకూ టెండర్లు గురించి విన్న జనం ఈ రివర్స్ టెండరింగ్ ఏంటా అని ఆశ్చర్యపోయారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా నచ్చినవారికి పంచి పెట్టే అవినీతి సంస్కృతికి అడ్డుకట్ట వేస్తానంటూ జగన్ ఈ కొత్త విధానం తెచ్చాడు. అంటే.. ఓ టెండర్ ఓకే అయినా.. దాని కంటే తక్కువకు చేస్తానని ఎవరైనా వస్తే.. ఆ టెండర్ కు వారికే అప్పగించడం.


పోలవరం టెండర్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయంటున్న జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గిస్తానంటున్నారు. ఈ అంశంపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కూడా వచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుత ప్రాజెక్టులలో రివర్స్ టెండరింగ్, కొత్త ప్రాజెక్టులలో టెండరింగ్ మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు, ప్రాజెక్ట్ కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడుతామని పేర్కొంది.


ప్రాజెక్టు అంచనా విలువతో సదరు ప్రాజెక్టు మిగిలిన పనులకు ఈ టెండరింగ్ కు వెళ్లనున్నామని, ఈ టెండరింగ్ లో పాల్గొనే సంస్థ ఏపీలో రిజిస్టర్ కావాలన్న నిబంధనను సడలించామని పేర్కొంది. బిడ్డరు రాకపోతే మిగిలిన పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి ఈ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది.


రివర్స్ టెండరింగ్ కు సంబంధించి వివిధ అంశాలపై స్పష్టతను ఇస్తూ 29 మార్గదర్శకాలను ఇస్తూ జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ తో పాటు, కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానంపై ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. జూలై 22 తేదీన నిర్వహించిన చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు మొత్తం 29 అంశాలను రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలుగా నిర్దేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: