ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత టీడీపీకి ఒక్కో నేత వ‌రుస పెట్టి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యేలే కాకుండా ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు కాషాయం గూటికి చేరిపోతున్నారు. ఇక తెలంగాణ‌లో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. వీళ్ల సంగ‌తి ఇలా ఉంచితే టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తోన్న మ‌హిళా నేత‌లు కూడా ఆ పార్టీని వీడిపోతున్నారు. ఇప్ప‌టికే రేవ‌తి చౌద‌రి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచి టీడీపీ త‌ర‌పున మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను బ‌లంగా వాయిస్ వినిపించిన ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి యామిని సాధినేని సైతం పార్టీని వీడుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.


ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆమె ఇటీవ‌ల క‌లిసిన ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె బీజేపీలోకి వెళ్లిపోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా యామిని టీడీపీ గురించి మాట్లాడ‌డం, ఆ పార్టీపై పోస్టులు పెట్ట‌డం త‌గ్గించేశారు. ఇక యామిని పార్టీ మార‌తార‌న్న వార్తలు ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది. మాజీ సినీ నటి.. టీడీపీ నేత దివ్యవాణి సైతం పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించి..కొద్ది కాలం క్రితం బీజేపీలో చేరిన ఓ కీల‌క నేత ఇప్పుడు దివ్య‌వాణిని సైతం బీజేపీలోకి తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.పార్టీ మారేందుకు దివ్య‌వాణి సైతం అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు దివ్య‌వాణిని టీడీపీలో చేర‌వ‌ద్ద‌ని మ‌రో సీనియ‌ర్ నేత జ‌య‌సుధ లాంటి వాళ్లు కూడా చెప్పినా ఆమె మాత్రం విన‌కుండా టీడీపీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం ఏపీలో ప‌ర్య‌టించారు కూడా. పార్టీ మ‌ళ్లీ గెలుస్తుంద‌ని న‌మ్మిన ఆమె ఇప్పుడు తాను నిండా మునిగిపోయానని తెగ బాధ‌ప‌డుతున్నార‌ట‌. 


పార్టీ ఓట‌మి త‌ర్వాత జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో కూడా దివ్య‌వాణి సీనియ‌ర్ నేత కోడెల లాంటి వాళ్ల కుటుంబాలు చేసిన అక్ర‌మాల‌పై నేరుగానే విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌న‌మ‌య్యారు. గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబం ఉన్న వ్యతిరేకత..వారు చేసిన దందాల ప్రభావం జిల్లా మొత్తం పడిందని అందరి సమక్షంలోనే దివ్య వాణీ పార్టీ అధినేతకు నివేదించారు. ఆ తరువాత ఒకటి రెండు సమావేశాలు మినహా దివ్య వాణీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. ఇక చంద్ర‌బాబు ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా మ‌న ప‌ని మ‌నం చేసుకు వెళ‌దామ‌ని ఆమెకు సూచించినా.. ఆమెకు మాత్రం టీడీపీ భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కం లేకే పార్టీ మారిపోదామ‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: