కృష్ణానదికి వచ్చిన వరదలు చివరకు బురద రాజకీయాలన్ని మిగులుస్తున్నాయి. వరద నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షం... అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ వచ్చిన ప్రతిపక్షనేత వరదలు రాగానే పరారయ్యారని వైసీపీ విమర్శించుకుంటున్నాయి. వరద నీటిలో మునిగిన ప్రతిపక్ష నేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్యకు కుట్ర పన్నినట్టా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.


పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవక ముందే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని విమర్శించారు. సోమవారం ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. కరకట్టపై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్‌ ఇంట్లో ఉన్న చంద్రబాబు ..తన విలువైన వస్తువులన్నీ తరలించారని తెలిపారు. చివరకు కృష్ణానది కావాలనే ప్రవాహాన్ని పెంటుకుంటోందని నిందించేట్టున్నారని పేర్కొన్నారు.


చంద్రబాబు బీజేపీని వదిలిపెట్టాక కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్‌గా చిత్రీకరించిందన్నారు. మొన్నటి దాకా మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని, ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారని విమర్శించారు. ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని, రివర్స్‌ గేర్‌ వేయక తప్పదని విజయసాయిరెడ్డి చెప్పారు.


మరోవైపు మంత్రి అనిల్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ తీరుపై మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్‌ మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో అధికారులు అందరూ బాగా పని చేశారని, కొందరు నేతలు, కొన్ని మీడియా సంస్థలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మామూలు సమయాల్లో హడావిడి చేసే చంద్రబాబు ఎందుకు వరద గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదెందుకని ప్రశ్నించారు.


టీడీపీ నేతలు వరద రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అనిల్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిత్యం రాష్ట్రంలో వరద పరిస్థితిపై సమీక్షిస్తున్నారని చెప్పారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: