ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ఎవ్వ‌రూ ఊహించ‌ని సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దేశ రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపుతున్నారు. ఈ క్ర‌మంలోనే స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అమ‌ల‌వుతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజ‌ర్వేష‌న్ల‌కు మంగ‌ళం పాడేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే తెలుస్తోంది. ఈ రిజ‌ర్వేష‌న్ల తేనెతుట్టెను ఆర్ఎస్ఎస్ ప‌దే ప‌దే వ్య‌తిరేకిస్తూనే వ‌స్తోంది. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ప్రస్తుత దుమారానికి కారణం.


దేశంలో రిజర్వేషన్లు సమీక్షించాల్సిందే అని గతంలో ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, వివిధరాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా మరోసారి ఆయ‌న ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. రిజ‌ర్వేష‌న్ల‌పై సామ‌ర‌స్యంగా చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న చెప్పారు. రిజ‌ర్వేష‌న్ల కోటా వ్య‌తిరేకించే వారు.. స‌మ‌ర్థించేవారు  కూర్చొని సామరస్యంగా మాట్లాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న చెప్పారు.


మోహన్ భగవత్ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి చర్చకు తేవడం పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఇది పేద ప్ర‌జ‌ల‌ను దెబ్బ‌తీయ‌డం, ద‌ళిత‌గిరిజ‌నుల హ‌క్కుల‌ను లాక్కోవ‌డ‌మే బీజేపీ ఎజెండాగా క‌నిపిస్తోంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేత పీఎల్‌.పునియా మాట్లాడుతూ బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ తొలి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు వ్యతిరేకమని విమ‌ర్శించారు.ఈ అంశంపై దేశంలో ఉన్న చాలా రాజ‌కీయ ప‌క్షాల నేత‌లు కూడా ఆర్ఎస్ఎస్ తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.


ఇక బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి మాట్లాడుతూ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌లు మొత్తం రిజర్వేషన్ల ఉనికినే ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తుండ‌డంతో ఆర్ఎస్ఎస్ వివ‌ర‌ణ ప్ర‌క‌ట‌న కూడా వ‌దిలింది. రిజ‌ర్వేష‌న్ల‌కు తాము వ్య‌తిరేకంగా కాద‌ని... సామరస్య పూర్వక వాతావరణంలో రిజర్వేషన్లపై చర్చించుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే భగవత్ గుర్తు చేశారని ప్రకటన విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: