2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ ప్రచార బరిలో దిగగా… వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే… నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దూకింది. ప్ర‌జ‌లు వైసీపీకి భారీ మెజార్టీతో ప‌ట్టంక‌ట్టారు. టీడీపీ ఎప్పుడూ చ‌రిత్ర‌లోనే ఓడిపోనంత ఘోరంగా ఓడిపోయింది. ఇక ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌ధానంగా అమ‌రావ‌తి, పోల‌వ‌రంను ప‌దే ప‌దే ప్ర‌చారం చేసింది. వైసీపీ అధికారంలోకి వ‌స్తే పోలవరం పనులను నిలిపేస్తుందనీ, రాజధానిని అమరావతి నుంచీ మరో చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. 


ఈ రెండు అంశాల‌పై వైసీపీని ఇరుకున పెట్టేలా టీడీపీ జోరుగా ప్రచారం చెయ్యడంతో… అప్పట్లో వైసీపీ నేతలు… ఆ వాదనను తప్పుపడుతూ కౌంటర్లు ఇచ్చారు. కానీ… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక… పోలవరం నిర్మాణాల్ని నిలిపేస్తూ రివర్స్ టెండరింగ్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపైనే అనేక అనుమానాలు ముసురుకున్నాయంటే.. ఇక ఇప్పుడు తాజాగా రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాకుండా, సామాన్య జ‌నాల్లోనూ అనేక ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.


బొత్స మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే డబుల్ అవుతోందన్నారు. దీని వ‌ల్ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అవుతుంద‌ని చెప్పిన ఆయ‌న కొన్ని సందేహాలు కూడా రాజ‌ధానిపై వ్య‌క్తం చేశారు. కృష్ణానది వరదలతో అమరావతిలో మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయని... అందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులే నిద‌ర్శన‌మ‌ని చెప్పారు. 


రాజ‌ధానిని వరదల నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, జలాశయాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌ధానిపై చ‌ర్చ జ‌రుగుతోంద‌ని... దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కూడా చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఇప్పుడు చాలా మందిలో రాజ‌ధాని మార్చేస్తార‌న్న అనుమానాలు ముసురుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా దొన‌కొండ‌కు రాజ‌ధాని మారిపోవ‌చ్చంటూ మ‌రో ప్ర‌చారం కూడా జోరందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: