రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసిన తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారా.. రాజధాని అమరావతి ప్రాంతంలో వస్తుందని తెలుసుకుని.. ఆ ప్రాంతంలో భారీగా భూములు కొన్నారా..అందులోనూ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బంధువులు జగ్గయ్య పేట ప్రాంతంలో ఏకంగా 400 ఎకరాల వరకూ కొన్నారా.. అందులోనూ చాలా చీప్ గా కేవలం ఎకరం లక్షకు కొన్నారా.. ?


అవునంటున్నారు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన బాలయ్య బంధువులపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంబంధించిన వారు జగ్గయ్యపేట సమీపంలో ఎకరం లక్ష రూపాయలు చొప్పున 400 ఎకరాలు కొనుగోలు చేశారట. అది ఇప్పుడు రూ.50 లక్షలు.. రూ.60 లక్షలు ధర పలుకుతోందని బుగ్గన అన్నారు. చివరకు డీ పట్టా భూములకు సంబంధించిన చట్టాలను మార్చి వాళ్లే భూములు కొనుగోలు చేశారని బుగ్గన ఆరోపించారు.


రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్, బలవంతపు భూసేకరణ, నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు. రాజధానికి సంబంధించి గుంటూరు, నూజివీడు వంటి పేర్లను ఉద్దేశ పూర్వకంగా లీకులిచ్చిన గత ప్రభుత్వంలోని వారు కొందరు మరోవైపు ప్రస్తుత రాజధాని ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆయన అన్నారు. 2014 జూన్‌ 2వ తేదీన రాజధాని ప్రకటించే నాటికి టీడీపీ నేతలు ఇప్పుడున్న రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారన్నారు.


ఇలాంటి అవకతవకలపై తమ ప్రభుత్వం పూర్తిగా సమీక్ష చేయాలని నిర్ణయించిందని బుగ్గ తెలిపారు. రాజధాని స్కాంపై విచారణ జరిపించి, ఆ నివేదిక అందాక ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. భూములు ఎవరికి కేటాయించారు.. వాటి అసలు యజమానులు ఎవరు.. బినామీలు ఎవరు.. తదితర అన్ని విషయాలు విచారణలో తేలుతుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: