ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి గట్టిగా మూడు నెలలు కూడా కాలేదు.. కానీ ఈ మూడు నెలల్లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు.. ఎన్నో వివాదాలు.. మొదట్లో వైసీపీకీ ఆరునెలలు సమయం ఇద్దామని టీడీపీ భావించిందట.. కానీ జగన్ సర్కారు అరాచకాలు చూసి ఆరు నెలలు టైమ్ ఇచ్చే ఆలోచన మానుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ సర్కారు ఏర్పడిన నెల రోజుల నుంచే టీడీపీ ప్రతిపక్ష పాత్రను జోరుగా పోషించడం మొదలుపెట్టింది.


వైసీపీ చర్యలను ఖండించడం.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం.. చివరకు చంద్రబాబు కూడా ఘాటు కామెంట్లు చేయడం.. ఇలా రాజకీయ రణరంగం ఏపీలో జోరుగానే సాగుతోంది. జగన్ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే రాజకీయం వేడెక్కింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం మరింత జోరు పెంచుతోంది. ఏకంగా చంద్రబాబే రెచ్చిపోయి మాట్లాడే పరిస్థితి వచ్చింది.


ఐతే.. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు వైసీపీ నాయకులు.. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేసి... చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్చాల్సిందేననని ఘాటుగా కామెంట్ చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కేవలం 3 నెలలు మాత్రమేనని, ఇప్పటికే ఇంతలా బట్టలు చించుకుంటున్న చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.


తిరుమలపై ఆర్టీసీ టికెట్ల ద్వారా అన్యమత ప్రచారం జరుగుతోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలను విజయసాయి ఖండించారు. తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాలకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను టీడీపీ హయాంలోనే ముద్రించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: