తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. మరో నాలుగైదు రోజుల్లో రోజుల్లోనే విస్తరణ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కేటీఆర్, గుత్తా సుఖేందర్ రెడ్డికి బెర్తులు ఖాయమైనట్టు తెలుస్తోంది. 


తెలంగాణలో రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక  మొద‌ట‌గా సీఎం కేసీఆర్, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ మాత్రమే ప్రమాణ‌స్వీకారం చేశారు. కొన్నాళ్లకు మరో పది మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు.  అయితే అంతకు ముందు మంత్రులుగా ఉన్న కొందరికి బెర్తులు దొరకలేదు. మంత్రులుగా తొలి కేబినెట్ లో ఉన్న న‌లుగురు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో వాళ్లను పక్కనపెట్టేశారు. గెలిచిన హ‌రీష్ రావు, ల‌క్ష్మారెడ్డి, కేటీఆర్ పాటు ఎమ్మెల్సీలుగా ఉన్న నాయిని న‌ర్సింహారెడ్డి, క‌డియం శ్రీహ‌రిల‌ను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని, జ‌గ‌దీష్ రెడ్డి, మ‌హ‌మూద్ అలీ, ఈట‌ల‌కు మ‌రోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్. ప్రశాంత్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లికి  తొలిసారి ఛాన్స్ దక్కింది.


దాదాపు ఏడు నెల‌లు గ‌డిచాక ఇప్పుడు  మ‌ళ్లీ  కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రెండోసారి గెలిచిన వెంట‌నే కేటీఆర్‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేయ‌డం, వ‌రుస ఎన్నిక‌లు రావ‌డంతో ఇన్నాళ్లు వేచిచూశారు. ఇప్పుడు కేటీఆర్‌ని కేబినెట్‌లోకి తీసుకోవ‌డం అనివార్యంగా  మారింది. కేటీఆర్ మంత్రివ‌ర్గంలో లేక‌పోవ‌డం వ‌ల్ల ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ‌ను ముఖ్యమంత్రే చూస్తున్నారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ విన‌తుల‌ను కేటీఆర్ ద్వారా సిఎంకు చేర‌వేసేవారు. కేటీఆర్ ఇప్పుడు మంత్రిగా కూడా లేక‌పోవ‌డంతో  ఇబ్బందులు తెలెత్తుతున్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద క్యాంప‌స్‌ను ఓపెన్ చేసినా... కేటీఆర్ ప్రారంభోత్సవానికి వెళ్లలేక‌పోయారు. కొంద‌రు ఎమ్మెల్యేలు అయితే బ‌హిరంగంగానే  కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని కోరుతున్నారు.


తెలంగాణ కేబినెట్ లో  సీఎంతో క‌లిసి 18 మంది ఉండొచ్చు. ఇప్పుడు కేబినెట్ 12 మందితో న‌డుస్తోంది. మ‌రో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్పటి దాకా కేబినెట్‌లో ఒక్క మ‌హిళ కూడా లేరు. ఈసారి ఇద్దరు మ‌హిళ‌ల‌ను కేబినెట్‌లోకి తీసుకుంటాన‌ని సియం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మ‌ధ్యే గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి  ఎమ్మెల్సీని చేశారు. ఈయ‌న‌కు  ఈసారి కేబినెట్‌లో  బెర్త్ ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌హిళ‌ల‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే వ‌రంగ‌ల్ నుంచి రాథోడ్‌కు ఛాన్స్ రానుంది. మ‌రో మ‌హిళ‌కు అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటే  స‌బితా ఇంద్రారెడ్డికి అవకాశం రావొచ్చు. హ‌రీష్ రావు విష‌యంలో ఇంకా స్పష్టత లేదు. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా నుంచి సండ్ర వెంక‌ట వీర‌య్య లేక మ‌రొక‌రికి ఛాన్స్ ద‌క్కొచ్చు.  శ్రావ‌ణ‌మాసం ముగిసేలోపు కేబినెట్ విస్తర‌ణ పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు. కేవ‌లం కేటీఆర్, గుత్తాను మాత్రమే ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకొని మిగిలిన వారిని రెండు మూడు నెల‌ల త‌ర్వాత తీసుకుంటార‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. వ‌రంగ‌ల్ నుంచి విన‌య్ భాస్కర్, క‌రీంన‌గ‌ర్ నుంచి గంగుల క‌మ‌లాక‌ర్  కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: