గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనను నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడింది. రాజకీయ ఒత్తిడులకు లొంగారంటూ గిరిజన సంఘాల నుండి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవడంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. మానవ మృగాలుగా మారిన ఇద్దరు యువకులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లిన పదహారేళ్ల అమ్మాయి కామాంధుల పైశాచికత్వానికి బలైపోయి ఇంటి ఎదుట శవమై కనిపించింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరులో జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది. చింతూరు మామిళ్లగూడెంలో పదహారేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి ఆపై హత్య చేసిన ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 



మామిళ్లగూడెం గ్రాములు స్థానిక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతుంది స్వప్న. గత నెల పదకొండున రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్వప్న తన స్నేహితురాలు ప్రవళికతో కలిసి బయటికెళ్ళింది అదే సమయంలో మిడియం రమేష్, ముచ్చిక లక్ష్మణ్ అనే ఇద్దరు మృగాళ్ల కళ్లు బాలికపై పడ్డాయి. మానవ మృగాలుగా మారిన దుర్మార్గులు బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఆ కామాంధులు కబంధ హస్తాల నుండి ప్రవల్లిక తప్పించుకుంది. స్వప్న మాత్రం వారికి చిక్కింది. దీంతో ఆ నరరూప రాక్షసులు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా బాలిక ప్రాణాలు తీశారు. తాము చేసిన ఘాతుకం బయటపడకుండా ఉండేందుకు బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి వద్దకు తీసుకొచ్చారు.


ఆ ఇంటి ఎదురుగా ఉన్న పూరి పాకలో స్వప్న ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి పరారయ్యారు. రాత్రి ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోవడంతో రెండ్రోజుల పాటు అన్ని చోట్ల వెతికింది బాలిక తల్లి. చివరికి ఇంటి ఎదురుగా ఉన్న పూరి పాకలో కుమార్తె మృతదేహం లభ్యం కావడంతో ఆమె హతాశురాలైంది. కామాంధులకు చిక్కకుండా పారిపోయిన మరో బాలిక ద్వార విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరింపులు, పెద్దల పంచాయితీ వ్యవహారంతో ఈ అన్యాయాన్ని ఎవరికీ చెప్పలేకపోయింది స్వప్న తల్లి. ఎట్టకేలకు చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని కలిసి గోడు వెళ్లబోసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి నుంచి కొంత ఆలస్యంగానైనా ఫిర్యాదు అందినప్పటికి ఈ కేసు విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పోలీసుల తీరు పట్ల ఆగ్రహించిన అనేక మంది గిరిజన విద్యార్థినులు, మహిళలు చింతూరులో నిరసన చేపట్టారు. నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 


గిరిజనుల ఆందోళనలు తీవ్రమవడంతో చింతూరు సీఐ గజేంద్ర, ఎస్సై మహాలక్ష్మిల పై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఘాతుకానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేశామని 302 సహా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు బాలిక తల్లి న్యాయ పోరాటం ఫలించింది. నెల రోజుల తర్వాత ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిర్భయ కేసు నమోదు కింద కటకటాలపాలయ్యారు నిందితులు.


మరింత సమాచారం తెలుసుకోండి: